Telagnana : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఫుల్లు ఖుషీ.. కారణమేంటో తెలుసా?

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్దిదారులు భారీ ఊరట చెందుతున్నారు

Update: 2025-12-02 04:46 GMT

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్దిదారులు భారీ ఊరట చెందుతున్నారు. నిబంధనల పేరుతో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అడ్డంకులు కల్పిస్తున్నారని తెలిసి ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఇది ఒకరకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పెద్ద ఊరట అని చెప్పాలి. నిబంధనలను ఉల్లంఘించారంటూ కొన్ని ఇళ్ల అనుమతులను కూడా అధికారులు రద్దు చేశారు. నిర్ణీత విస్తీర్ణంలోనే ఇళ్లు కట్టుకోవాలని, నిబంధనలను అతిక్రమించ వద్దని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే లబ్దిదారుల అగచాట్లను గుర్తించిన ప్రభుత్వం వెంటనే నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో లబ్దిదారులు ఖుషీ ఫీలవుతున్నారు.

నిబంధనలు అతిక్రమించిన...
ఇప్పటి వరకూ ఇందిరమ్మ ఇళ్ల ఖచ్చితంగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు విస్తీర్ణంలో నిర్మించుకోవాలన్న నిబంధనలను ప్రభుత్వం తాజాగా సడలించింది. అయితే అనేక చోట్ల స్థలం అందుబాటులో లేకపోవడంతో తక్కువ విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి లబ్దిదారులు ఇష్టపడటం లేదు. ఇళ్లు మంజూరయినప్పటికీ నిర్మాణాలను ప్రారంభించ లేదు. దీంతో కొన్ని లబ్దిదారులకు మంజూరయిన ఇళ్లను కూడా అధికారులు రద్దీ చేశారు. ప్రధానంగా నగరం, పట్టణ ప్రాంతాల్లోనే స్థలం సమస్య ఎక్కువగా ఉంది. లబ్దిదారులు పలుమార్లు గ్రామ సభల్లో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వ నిబంధనలను తాము పక్కన పెట్టలేమని చెప్పారు.
తాజా ఉత్తర్వులతో...
అయితే ప్రజాప్రతినిధులు చాలా మంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 44.4 చదరపు గజాల లోపు స్థలం ఉన్నప్పటికీ జీ ప్లస్ వన్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తక్కువ స్థలం ఉన్నా జీ ప్లస్ వన్ ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల తమకు కూడా కొంత వెసులు బాటు దొరుకుతుందని, వీలయినంతగా ఇల్లు బాగా కట్టుకుంటామని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జీ ప్లస్ వన్ నిర్మాణం చేపట్టాలంటే ముందుగా గృహనిర్మాణ సంస్థ డీఈఈ అనుమతి తీసుకోవాలని, ఆర్.సి.సి. ఫ్రేంలోనే నిర్మించాలని, ఖచ్చితంగా వంటగది, మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని నిబంధనలను మార్చింది. గ్రౌండ్ ఫ్లోర్ కు లక్ష, రూఫ్ లెవెల్ కు మరో లక్ష, మొదటి అంతస్తు పూర్తయితే రెండులక్షలు, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది నిజంగా ఇందిరమ్మ లబ్దిదారులకు భారీ ఊరట అని చెప్పాలి.


Tags:    

Similar News