Telangana : బీసీ రిజర్వేషన్ల కోసం.. నేడు రాష్ట్ర బంద్

బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది

Update: 2025-10-18 02:09 GMT

బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణలో రాజకీయంగా మంటలు రేపుతుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో తీర్పు రావడంతో నేడు బీసీ సంఘాలు తెలంగాణ బంద్ కు పిలుపు నిచ్చాయి. అయితే ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీసీ రిజర్వేషన్లకు తాము ఛాంపియన్లమంటూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. రాజకీయం సంగతి పక్కన పెడితే ఈరోజు తెలంగాణ బంద్ పూర్తిగా విజయవంతం అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే నేటి బంద్ కు అధికార, విపక్షాలు మద్దతిస్తుండటంతో బంద్ విజయవంతమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. బంద్ కు కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

అన్ని రాజకీయ పార్టీలు...
బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ కు ఆర్టీసీ యూనియన్లు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో నేడు ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండదు. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తాము బంద్ లో పాల్గొంటామని చెప్పింది. బీజేపీ నేతలు కూడా బంద్ లో తాము నిలబడి విజయవంతం చేస్తామంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కూడా బంద్ లో పాల్గొనడంతో సక్సెస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నీ నేడు మూత బడనున్నాయి. హైదరాబాద్ తో పాటు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు బంద్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యాసంస్థలు కూడా...
ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు కూడా నేడు మూత పడనున్నాయి. అయితే రాష్ట్ర డీజీపీ మాత్రం శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఇప్పటికే బంద్ చేస్తున్న వారికి చెప్పారు. బంద్ పేరుతో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించిన వారిని ఉపేక్షించబోమని, క్రిమినల్ కేసులు పెడతామని డీజీపీ హెచ్చరించారు.నేడు బంద్ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్ వంటి పట్టణాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక వ్యాపార వర్గాలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నాయి. దీపావళి పండగ సీజన్ కావడంతో ఎక్కువ వ్యాపారాలుంటాయని, అయినా దుకాణాలు తెరవకుండా బంద్ కు సంఘీభావాన్ని ప్రకటించే అవకాశముంది. మొత్తం మీద నేటి తెలంగాణ బంద్ శాంతియుతంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.


Tags:    

Similar News