Telangana : బిగ్ బాస్ రేవంత్ కు ఇచ్చిన టాస్క్ ఇదేనా? అజర్ భయ్యాకు మంత్రి పదవి అందుకేనా?
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రి కాబోతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పట్టుబడితే ఏకంగా మంత్రిపదవి ఆయనకు దక్కింది.
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రి కాబోతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పట్టుబడితే ఏకంగా మంత్రిపదవి ఆయనకు దక్కింది. దీనిని బట్టి పార్టీ హైకమాండ్ వద్ద అజారుద్దీన్ ఎంత పట్టు ఉందో చెప్పకనే తెలుస్తుంది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించారు. అయితే రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ నేతలు కూడా అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని బలపర్చలేదు. అజర్ భయ్యాపై నమ్మకం లేదు. అందులోనూ ఆ నియోజకవర్గంలో పట్టున్న శ్రీశైలం యాదవ్ కుమారుడు చిన శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కు ఇవ్వాలని పట్టుబట్టారు. నవీన్ యాదవ్ అయితేనే తాము గెలిపించుకుని వస్తామని హైకమాండ్ కు చెప్పినట్లు తెలిసింది.
అజార్ కు టిక్కెట్ ఇవ్వకుండా...
అయితే పార్టీ అధినాయకత్వం కూడా అజారుద్దీన్ అభ్యర్థిత్వంపై అభ్యంతరం చెబుతున్న రేవంత్ రెడ్డి అండ్ టీంకి బిగ్ టాస్క్ కు అప్పగించినట్లయింది. రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ సూచించిన విధంగానే అజారుద్దీన్ కు టిక్కెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్ కు టిక్కెట్ ఇచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించుకుని రావాల్సిన అతి పెద్ద బాధ్యత రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులపై కూడా పడింది. 2023 ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తొలి నాళ్లలో అజారుద్దీన్ కే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, పీసీసీ చీఫ్ వరకూ ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేదు. లోకల్ గా అందుబాటులో ఉండే వారికే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టి నవీన్ యాదవ్ కు టిక్కెట్ ఇప్పించుకుని వచ్చారు.
మంత్రి పదవి ఇవ్వాలని...
కానీ రేవంత్ టీం కు పార్టీ నాయకత్వం ఝలక్ ఇవ్వడానికి సిద్ధమయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. మైనారిటీ ఓట్లు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటమే కాకుండా రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనారిటీలకు అవకాశం లేకపోవడంతో అజారుద్దీన్ ను ముందు మంత్రిని చేసి ఆరు నెలల్లో ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. దీంతో అజారుద్దీన్ గారెల బుట్టలో పడినట్లయింది. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తే ఏకంగా మంత్రి పదవి రావడంతో ఆయన ఖుషీగా ఉన్నారని తెలిసింది. హైకమాండ్ ఆదేశాలతో శుక్రవారం రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.