Formula E Car Race Case : పార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఏం చేయబోతుంది?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఫార్ములా ఈ రేసు కారు కేసులో నోటీసులు జారీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఫార్ములా ఈ రేసు కారు కేసులో నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో రెండోసారి నోటీసులు జారీ చేశారు.దీంతో రేపు ఏం జరగబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఒకసారి విచారించిన కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మే 26వ తేదీనవిచారణకు రావాలని నోటీసుల్లో కోరగా, అప్పటికేముందుగా ఫిక్స్ అవ్వడంతో తాను విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పారు. ఈ మేరకు నోటీసులు తాజాగా జారీ చేశారు.
ఎనిమిది నెలల నుంచి...
ఫార్ములా ఈ కారు రేసును తెలంగాణలో ఏసీబీ అధికారులు గత ఎనిమిది నెలల నుంచి విచారణ చేస్తున్నారు. అనేక మందిని ఇప్పటికే విచారించి కేసులోఅనేక విషయాలను రాబట్టారు. దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలను విదేశాలకు మళ్లించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు మంత్రివర్గం ఆమోదం లేకుండా హెచ్ఎండీఏ నిధులను మళ్లించడంపై ఇప్పటివరకూ అనేక మందిని విచారన జరపారు. గత ఏడాది డిసెంబరు 19వ తేదీన ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అరవిందకుమార్ తో పాటు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. కేటీఆర్ ను కూడా విచారణ చేసింది.
మరోసారి నోటీసులు ఇవ్వడంతో...
ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులను కూడా వర్చువల్ గా విచారించింది. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరడంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచారణకు సహకరిస్తానని, ప్రభుత్వ బెదరింపులకు తాను లొంగనని చెప్పారు. ఈ నెల 16వ తేదీన తాను విచారణకు హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పాలన చేతకానప్పడు ఇతర విషయాలపై దృష్టి పెట్టడం సహజమేనని కేటీఆర్ ఎక్స్ లో ఇటీవల ట్వీట్ చేశారుకూడా. అయితే రేపు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం వద్దకు తరలి వచ్చే అవకాశముందని తెలిసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.