వామ్మో.. మళ్లీ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

గురువారం వరకూ రాష్ట్రంలో సీజన్ సగటు 329.3 మిల్లీమీటర్లకు గాను 530 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ

Update: 2023-07-28 08:08 GMT

ఒక ఏడాదిలో కురవాల్సిన వాన.. ఒక్కరోజులో కురిస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు నిదర్శనం మన తెలంగాణ. బుధవారం రాత్రి నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలకు తెలంగాణలో జలవిలయం సంభవించింది. కుండెడు నీళ్లు ఒక్కసారి గుమ్మరించినట్టుగా కురిసిన వానకు వాగులు, వంకలు ఉప్పొంగి కట్టలు తెగిపోయి.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతంతో కొత్త రికార్డు నమోదైంది. ఫలితంగా జనజీవనం స్తంభించింది. ఇదే జిల్లా వాజేడులో 2013 జూలై 19న 51.75 సెం.మీ వర్షపాతం నమోదైంది.

గురువారం వరకూ రాష్ట్రంలో సీజన్ సగటు 329.3 మిల్లీమీటర్లకు గాను 530 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. రాత్రికి రాత్రి వచ్చిన వరదలకు జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ.. సహాయం కోసం ఎదురుచూశారు. మోరంచపల్లి గ్రామంలో సంభవించిన వరదలను చూసి ఎమ్మెల్యేలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. పదులసంఖ్యలో ఆయా గ్రామాల్లోని గ్రామస్తులు వరదల్లో కొట్టుకుపోగా.. కొందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం సాయంత్రం నుంచి వర్షం కాస్త తెరపించడంతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకునే లోపే.. మళ్లీ భారీ వర్షాలంటూ వాతావరణశాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొన్నిజిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాటితో పాటు ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, సంగారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముసురుగా ఉండటంతో.. స్థానిక నివాసితులు బిక్కుబిక్కుమంటూ.. ఈ గండం ఎప్పటికి గట్టేక్కెనో అని కాలం వెళ్లదీస్తున్నారు. కోఠి, నాంపల్లి, లక్డీకపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్టా, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, ఏఎస్‌ రావు నగర్‌, కూకట్‌పల్లి, నీజాంపేట్‌, మూసాపేట్‌, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతి నగర్‌, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


Tags:    

Similar News