సిగాచీ పరిశ్రమలో 31 మందికి చేరిన మృతుల సంఖ్య

పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 31 మంది కార్మికులు మరణించారు.

Update: 2025-07-01 02:09 GMT

పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 31 మంది కార్మికులు మరణించారు. నిన్న ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో రియాక్టర్ పేలడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సహాయకచర్యలు వెంటనే ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరంతా విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కొందరు గాయాలతో బయటపడగా మరికొందరు అక్కడిక్కడే మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఐదుగురు కార్మికుల ఆచూకీ ఇంత వరకూ లభించలేదు.

మరింత పెరిగే అవకాశం....
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకూ 31 మృతదేహాలను వెలికి తీశారు. పేలుడు సమయంలో అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని, దాని వల్ల అక్కడ పనిచేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. పేలుడు ధాటికి భవనం కుప్ప కూలింది. కొన్ని మృతదేహాలు పేలుడు ధాటికి యాభై మీటర్ల దూరంలో పడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. దాదాపు పదకొండు ఫైర్ ఇంజిన్లు నిర్విరామంగా పనిచేసినా చాలా సేపటి తర్వాత కానీ మంటలు అదుపులోకి రాలేదు. రసాయన పరిశ్రమ కావడంతో లోపలకి వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
రాత్రంతా సహాయక చర్యలు...
రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా,అగ్రిమాపక సిబ్బంది నిర్విరామంగా పనిచేసినా కార్మికులను రక్షించలేకపోయారు. అప్పటికే కొందరు మరణించగా గాయాలపాలయిన వారిని వెంటనే ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూకొందరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరుకుంది. ఇంత పెద్ద స్థాయిలో కార్మికులు మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియోను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. మొత్తంమీద ఈ ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపింది.
Tags:    

Similar News