Crime News : వివాహేతర సంబంధంతో భర్తను హతమార్చిన భార్య
మెదక్ జిల్లాలో తిమ్మాపూర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలసి భార్య కడతేర్చింది
మెదక్ జిల్లాలో తిమ్మాపూర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలసి భార్య కడతేర్చింది. మౌనికకు పన్నెండేళ్ల క్రితం స్వామితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనకంటే చిన్న వాడైన ఇరవై మూడేళ్ల యువకుడైన సంపత్ తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత కొన్నాళ్ల నుంచి మౌనిక, ఆ యువకుడి వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. భర్తకు ఇది తెలయకపోవడంతో ఇద్దరు మరింత చేరువయ్యారు. కొంతకాలం భర్తకు తెలియకుండానే వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు.
భర్త హెచ్చరించడంతో...
కానీ భర్తకు విషయం తెలియడంతో తొలుత పద్ధతి మార్చుకోవాలని మౌనికను హెచ్చరించాడు. అయితే మౌనిక లెక్క చేయలేదు. దీంతో స్వామి పెద్దల వద్ద పంచాయతీ పెడతానని భార్య మౌనికను స్వామి బెదిరించాడు. దీంతో భయపడిపోయిన మౌనిక ఎలాగైనా భర్తను లేపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడు సంపత్ తో కలసి స్కెచ్ వేసింది. స్వామికి మద్యం తాగే అలవాటు ఉండటంతో ఒకరోజు మద్యం తాగి ఇంటికి వచ్చిన స్వామిని గమనించిన మౌనిక తన ప్రియుడు సంపత్ కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది.
ఇద్దరూ కలసి హత్య చేసి...
ఇద్దరు కలసి భర్త స్వామిని గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి స్వామి మృతదేహాన్ని చెరువులో పడేశారు. తన భర్త మద్యం తాగి చెరువులో పడిపోయి చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే మౌనిక వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన పద్ధతిలో విచారించారు. దీంతో తామే స్వామిని చంపినట్లు అంగీకరించింది. దీంతో మెదక్ పోలీసులు మౌనికతో పాటు హత్యకు సహకరించిన సంపత్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే భర్తను కడతేర్చిన మౌనికపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.