Asia Cup : వత్తిడిని యువజట్టు తట్టుకుంటుందా? ఈ పరిస్థితుల్లో సక్సెస్ రేట్ ఎంత?
ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది
ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి రోహిత్ శర్మ లేడు. విరాట్ కోహ్లి లేడు. యువజట్టు పాక్ తో ఆసియా కప్ లో తలపడుతుంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఉంటారు. ఈజట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బూమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ లు ఉంటారు. అందరూ ఐపీఎల్ లో ఆవలి పక్షానికి చుక్కలు చూపించిన వారే. భారత్ జట్టు బలంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ అనుభవం అన్నదే ముఖ్యమంటున్నారు.
ఈ నెల 14వ తేదీన...
ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఈ నెల 14వ తేదీన జరగనుంది. రెండు జట్లు సుదీర్ఘకాలం తర్వాత మైదానంలో కనిపిస్తుండటంతో ఆ రోజు రెండు దేశాలు హీటెక్కడం ఖాయమని చెప్పాలి. అయితే ఆ వత్తిడిని యువజట్టు ఎలా ఎదుర్కొంటుందన్నదే ఇప్పుడు అందరిలోనూ అనుమానం. యువజట్టులో కొందరు ఆసియా కప్ లో తొలిసారి ఆడుతుండటంతో రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరులో రెండు రోజుల ముందు నుంచే ప్లేయర్లపై వత్తిడి పెరుగుతుంది. అది సహజం. సీనియర్లు అయితే దానికి అలవాటు పడ్డారు కాబట్టి వత్తిడి ప్రభావం మైదానంలో కనిపించదు. కానీ జూనియర్లు వత్తిడిని తట్టుకుని గ్రౌండ్ లో చెలరేగిపోతారా? లేదా? అన్నది సందేహంగానే ఉంది.
గణాంకాలు చూస్తే...
ఛాంపియన్స్ ట్రీఫీ తర్వాత భారత్ - పాకిస్తాన్ జట్లు టీ 20 ఫార్మాట్ లో తొలి సారి తలపడుతున్నాయి. కానీ నాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పహాల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాలతో ఇరు జట్లు తలపడుతుండటంతో ప్రెజర్ ను ఎలా తట్టుకుంటరాన్నది మాత్రం చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ను మట్టికరిపించిన భారత్ ట్రాక్ రికార్డు చూస్తే టీ 20లోనూ ఆధిపత్యం కనిపిస్తుంది. పాక్ - భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో టీం ఇండియా ఎలా ఆడుతుందన్నది అందరిలోనూ కలుగుతున్న ప్రశ్న. గణాంకాలు చూస్తే భారత్ - పాకిస్తాన్ మధ్య పదమూడు టీ 20 మ్యాచ్ లు జరిగితే అందులో పది మ్యాచ్ లలో భారత్ గెలిచింది. మూడింటిలోనే పాక్ నెగ్గింది. మరి ఈ సారి ఏం జరుగుతుందోనన్నది చూడాలి.