పాకిస్థాన్ ప్రపంచ కప్ ఆశలు గల్లంతైనట్లేనా?

ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసింది. ఎన్నో మ్యాచ్ లలో పాకిస్థాన్ జట్టును

Update: 2023-10-24 02:17 GMT

ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసింది. అంతకు ముందు ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఎన్నో మ్యాచ్ లలో పాకిస్థాన్ జట్టును ఓడించే అవకాశం దక్కినా కూడా చివరికి పాకిస్థాన్ నే విజయం వరించేది. ఇప్పటిదాకా 7 వన్డే మ్యాచ్ లలో పాకిస్థాన్ గెలిచింది.. ఒక్క మ్యాచ్ కూడా ఆఫ్ఘన్ గెలవలేదు. అలాంటిది ప్రపంచ కప్ వేదికగా ఇన్నాళ్ల పగను ఆఫ్ఘన్ తీర్చుకుంది. 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఆఫ్ఘన్. భారత్ తో ఓటమి తర్వాత పాకిస్థాన్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియాతోనూ ఓడిపోయింది. ఇప్పుడు ఆఫ్ఘన్ చేతిలోనూ చావు దెబ్బ తిన్నది. ఈ వరుస ఓటములు పాకిస్థాన్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేశాయి. మిగిలిన అన్ని మ్యాచ్ లలో పాకిస్థాన్ నెగ్గితే కానీ సెమీస్ కు చేరడం కష్టమే!! ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే ఇంగ్లండ్ ను ఓడించిన ఆఫ్ఘన్.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పాక్ పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన పాక్ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

283 పరుగుల ఛేజింగ్ లో ఆఫ్ఘన్ టాపార్డర్ అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 130 పరుగులు జోడించగా.. ఆ తర్వాత రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది మిగతా పని పూర్తి చేశారు. రహ్మనుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత రహ్మత్ షా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, షాహిది 45 బంతుల్లో 48 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 1, హసన్ అలీ 1 వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ చైనామన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. నూర్ అహ్మద్ 3 కీలక వికెట్లు తీసి పాక్ ను దెబ్బకొట్టాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58), కెప్టెన్ బాబర్ అజామ్ (74), మహ్మద్ రిజ్వాన్ (8)లను నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. 44 ఓవర్లలో పాక్ స్కోరు 5 వికెట్లకు 215 పరుగులు. ఆ తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ హిట్టింగ్ తో ఆఖరి 5 ఓవర్లలో పాక్ జట్టుకు 61 పరుగులు వచ్చాయి. ఇఫ్తికార్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేశాడు. షాదాబ్ 38 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 40 పరుగులు చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2, మహ్మద్ నబీ 1, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ తీశారు.


Tags:    

Similar News