India vs West Indies : వెస్టిండీస్‌పై భారత్ గెలుపు.. గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్

రెండోటెస్ట్ లోనూ భారత్ వెస్టిండీస్ పై విజయం సాధించింది

Update: 2025-10-14 06:23 GMT

రెండోటెస్ట్ లోనూ భారత్ వెస్టిండీస్ పై విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ జట్టు విజయం నిన్నే ఖాయమయింది. భారత జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు తొలి టెస్టు సిరీస్ విజయం లభించింది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. కెఎల్‌ రాహుల్‌ 58 పరుగులతో నాటౌట్‌ గా నిలిచి బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. నిన్న యశస్వి జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత్ నేడు సుదర్శన్, గిల్ వికెట్లను కోల్పోయింది.

ఈరోజు ఉదయం...
ఐదో రోజు ఉదయం సాయి సుదర్శన్‌, కెఎల్ రాహుల్‌ తమ ఓవర్‌నైట్‌ స్కోర్లు 25, 30తో భారత్‌ 121 పరుగుల లక్ష్య ఛేదనను కొనసాగించారు. ప్రారంభంలో జాగ్రత్తగా ఆడిన ఈ జంటలో కేఎల్ రాహుల్‌ వేగం పెంచి సిక్సర్‌ కొట్టి అలరించారు. వెంటనే ఫ్లిక్‌ షాట్‌తో బౌండరీ సాధించాడు. సుదర్శన్ 39 పరుగులు చేసి కూడా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. చివరకు కెప్టెన్‌ రోస్టన్‌ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత గిల్‌ పదమూడు పరుగులు చేశాడు. సిక్సర్‌, ఫోర్‌ బాదినప్పటికీ జస్టిన్‌ గ్రీవ్స్‌కి మిడ్‌ వికెట్‌లో దొరికిపోయాడు.
రాహుల్ నిలబడి...
కేఎల్ రాహుల్‌ మాత్రం అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్వీప్‌ షాట్‌తో రెండు పరుగులు తీసి అర్ధశతకం పూర్తి చేశాడు. ధ్రువ్‌ జురెల్‌ కూడా కొంత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నాలు చేశాడు. చివరగా రాహుల్‌  బౌండరీతో మ్యాచ్‌ను ముగించి భారత్‌కు విజయాన్ని అందించాడు. వెస్టిండీస్ పై భారత్ కు ఇది వరసగా పదో విజయం. కులదీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గానూ, రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గానూ ఎంపికయ్యారు. క్లీన్ స్వీప్ చేసిన భారత యువజట్టు గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ ను కైవసం చేసుకున్నట్లయింది.


Tags:    

Similar News