Hydra : భూ వివాదాలపై హైడ్రా ఏమందంటే.. వారిని వదిలిపెట్టం.. కఠిన చర్యలుంటాయ్
ప్రయివేటు భూ వివాదాల్లో జోక్యం ఉండదని హైడ్రా అధికారులు తెలిపారు. చెరువులు, ప్రభుత్వ భూములపై ఆక్రమణలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు
ప్రయివేటు భూ వివాదాల్లో జోక్యం ఉండదని హైడ్రా అధికారులు తెలిపారు. చెరువులు, ప్రభుత్వ భూములపై ఆక్రమణలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రైవేట్ భూ యాజమాన్య వివాదాల్లో ఎలాంటి జోక్యం చేసుకోబోమని మరోసారి స్పష్టం చేసింది. అయితే చెరువులు, కుంటలు, కాలువలు, పార్కులు, ప్రభుత్వ భూములు మరియు ప్రజా ప్రదేశాలపై ఎలాంటి ఆక్రమణలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో వెర్టెక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ మరియు చైతన్య రెడ్డి అనే మహిళ మధ్య కొనసాగుతున్న వివాదం పూర్తిగా వ్యక్తిగతమని హైద్రా స్పష్టం చేసింది.
ఇలాంటి కేసుల్లో...
రెండు వర్గాలను ఎదురెదురుగా నిలబెట్టి పారదర్శక విచారణ నిర్వహించామని, ఇలాంటి కేసుల్లో హైడ్రాకు తీర్పు చెప్పే అధికారమేమీ లేదని అధికారులు తెలిపారు. సురం చెరువులో వెర్టెక్స్ అక్రమ నిర్మాణాలు చేసినప్పుడు వాటిని కూల్చివేసినట్లు, అలాగే కోతకుంట చెరువులో మట్టిని పడేయడం అంశాన్ని కూడా సీరియస్‌గా పరిగణించి రెండు కేసులు నమోదు చేసినట్లు హైడ్రా గుర్తు చేసింది. హైకోర్టు బార్ కౌన్సిల్ నుండి తొలగించిన న్యాయవాది సుంకర నరేష్ చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది.
మధ్యవర్తులుగా ఉంటే...
చైతన్య రెడ్డి ఇప్పటికే వెర్టెక్స్‌పై రహదారి నిర్మాణ వివాదం కారణంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని, అదనంగా న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చని హైడ్రా వివరించింది. ఇక మరోవైపు, చైతన్య రెడ్డి నరేష్ మరియు అతని అనుచరులు యాభై లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై హైడ్రా ఇద్దరినీ ప్రశ్నించి, పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు కోరిందని తెలిపారు. హైడ్రా పై తప్పుడు ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం సుంకర నరేష్ చేస్తున్నాడని విమర్శిస్తూ, ప్రజలు తప్పుడు సమాచారానికి లోనుకాకూడదని విజ్ఞప్తి చేసింది. దళారీ వ్యవహారాన్ని పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి నిజాన్ని వెలికితీయాలని ఒక ప్రకటనలో పేర్కొంది.