ఐసీసీ పీఠంపై అతడే..!

Update: 2022-11-12 11:07 GMT

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం తొలుత- జింబాబ్వే క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ తవెంగ్వా ముకుహ్లాని పోటీ పడ్డారు. చివరి నిమిషంలో ఆయన ఈ రేసు నుంచి తప్పుకున్నారు.

తెవెంగ్వా ముకుహ్లానీ పోటీ నుంచి తప్పుకోవడంతో గ్రెగ్ బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఐసీసీ తెలిపింది. రెండేళ్ల పాటు గ్రెగ్ బార్క్లే ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ఐసీసీ ఛైర్మన్ గా మరోసారి ఎన్నిక కావడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని.. తనకు మద్దతు ఇచ్చినందుకు ఐసీసీ డైరెక్టర్లకు కృతజ్ఞతలు చెబుతున్నానని గ్రెగ్ బార్క్లే చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారంగా ఐసీసీ సభ్య దేశాలకు నగదు పంపిణీ వంటి కార్యకర్మాలను ఆ కమిటీ చూసుకుంటుంది. ఐసీసీ నిర్వహించే వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించేది ఈ కమిటీనే. అలాంటి కమిటీకి అధినేతగా జై షా ఎన్నిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ కు చెందిన జై షా 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా ఉంటున్నారు. 2021 జనవరి 30 నుంచి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. క్రికెట్ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందిస్తామని గ్రెగ్ బార్క్లే చెప్పారు. గత రెండేళ్లుగా తాము క్రికెట్ ను విజయవంతంగా నడిపించడానికి కీలక అడుగులు వేశామని తెలిపారు. ఈ ఎన్నికలో బీసీసీఐతో పాటు మరో 16 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్‌ బార్క్లేకు మద్దతిచ్చారు.


Tags:    

Similar News