ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ధోనికి చోటు
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి మహేంద్ర సింగ్ ధోనికి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మొత్తం ఏడుగురికి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఈ ఏడాది స్థానం దక్కింది. భారత్ నుంచి ఎంఎస్ ధోనీ, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రేమీ స్మిత్, హషీమ్ అమ్లా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరి ఉన్నారు. మహిళా క్రికెటర్లలో పాక్ నుంచి సనా మిర్, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సారా టేలర్‌కు అవకాశం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ ఐసీసీ ఛైర్మన్ జైషా ఈ ప్రకటన విడుదల చేశారు.
భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 17,266 పరుగులు సాధించాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.