T20 World Cup : బంతి.. బంతికి.. పరుగు.. పరుగునూ ఇక లెక్కేసుకోండి భయ్యా?

టీ20 వరల్డ్ కప్ లో నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. కొలొంబో వేదికగా భారత్ - పాకిస్తాన్ జట్లు మ్యాచ్ ఆడనున్నాయి

Update: 2026-02-15 02:39 GMT

టీ20 వరల్డ్ కప్ లో నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. కొలొంబో వేదికగా భారత్ - పాకిస్తాన్ జట్లు మ్యాచ్ ఆడనున్నాయి. భారత్ - పాక్ మ్యాచ్ అంటే ఎప్పటికీ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కు క్రికెట్ ఫీవర్ తప్పదు. బాల్ .. బాల్ కు.. పరుగు .. పరుగుకు.. లెక్కలు వేసుకుని మరీ టెన్షన్ పడే ఏకైక మ్యాచ్ అంటూ ఏదైనా ఉందంటే ఇది మాత్రమే. అందుకే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లకు కేవలం స్టేడియంలో సీట్లు మాత్రమే కాదు.. టీఆర్పీ రేటింగ్ కూడా భారీగా నమోదవుతుంది. ఇక ప్రకటనల రూపంలో ఆదాయాన్ని గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. గణాంకాల ప్రకారం చూస్తే భారత్ చాలా వరకూ పాక్ కంటే మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేం.

భారత్ బలం ఇదే...
మ్యాచ్ ఎవరి వైపు అయినా సులువుగా తిరిగే అవకాశముంది. అయితే భారత్ జట్టు టీ20 మ్యాచ్ లలో ప్రపంచంలోనే మేటి జట్టుగా ఉంది. బ్యాటర్లు, బౌలర్లు సమపాళ్లలో ఉండటం భారత్ బలం. అయితే అమెరికా, నమీబియాపై భారత్ చెమటోడ్చి గెలిచిన తర్వాత కొన్ని సందేహాలు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. పసికూనలపై కష్టపడి గెలవడంతో పాటు నమీబియాలో బ్యాటర్లు విఫలం కావడం కూడా కొంత చర్చకు దారి తీసింది. పాక్ స్పిన్నర్ల ధాటికి భారత్ తట్టుకుంటుందా? లేదా? అన్న అనుమానాలున్నాయి. అయితే ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు ఉండటం భారత్ కు కలసి వచ్చే అంశం. అభిషేక్ శర్మ వస్తుండటం కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి.
పాక్ నమ్మకం ఇదే...
ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే భారత్ తో మ్యాచ్ అంటే వత్తిడికి ఎక్కువగా లోనవుతుంది. వత్తిడిలో కొన్ని పొరపాట్లు దాని ఓటమికి కారణమవుతాయని చెప్పాలి. భారత్ జట్టుకు వత్తిడి భయం లేదు. మరొకవైపు పాక్ లో స్పిన్నర్లు ఆ జట్టుకు బలంగా కనిపిస్తున్నారు. బ్యాటర్లలోనూ మంచి హిట్టర్లు న్నారని, దీంతో తమ గెలుపు ఈసారి భారత్ పై సునాయసమేనని అంటున్నారు. కానీ గణాంకాలు చూస్తే భారత్ వైపు చూపిస్తున్నాయి. రికార్డు లేకపోయినా ఈసారి విజయం సాధిస్తామని ఆ జట్టు ధీమాగా కనిపిస్తుంది. కొలొంబోలో గత కొన్ని రోజులుగా ఆడుతున్న మ్యాచ్ లు పాక్ కు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మరొకవైపు నేడు కొలొంబోలో వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కురిస్తే మ్యాచ్ ను రద్దు చేస్తే చెరొక పాయింట్ వస్తుంది. లేకుంటే.. ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహిస్తారు.


Tags:    

Similar News