High Way Hotels : హైవేపై హోటళ్లలోనూ పెరిగిన రద్దీ... తినడానికి సీటు దొరకడమూ కష్టమే

సంక్రాంతి పండగకు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది.

Update: 2024-01-13 07:36 GMT

సంక్రాంతి పండగకు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒక్కటి కాదు.. రెండు కాదు వేల సంఖ్యలో వాహనాలు వచ్చి టోల్ ప్లాజాల వద్ద వెయిట్ చేస్తుండటం కనిపిస్తుంది. పంతంగి ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు పది గేట్లను ఎత్తి వేసినా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలు కూడా నెమ్మదిగానే బయలుదేరుతున్నాయి.

టోల్ ప్లాజా దాటాలంటే?
దీంతో పాటు ఒక్కొక్క టోల్‌ప్లాజా దాటాలంటే కనీసం అరగంట నుంచి గంట సమయం పడుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి పండగ కోసం విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనాలన్నీ ఇటే వస్తుండటంతో ట్రాఫిక్ ను పోలీసులు కూడా నియంత్రించ లేకపోతున్నారు. టోల్ ప్లాజాల వద్ద పోలీసులను ప్రత్యేకంగా నియమించినా కార్లలో వస్తుండటంతో వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నారు.

ఉదయాన్నే బయలుదేరడంతో...
అయితే ఇదిలాఉండగా ఉదయాన్నే బయలుదేరడంతో ప్రయాణికులు టిఫిన్ చేయాలంటే హైవేపై ఉన్న హోటళ్ల వద్ద కూడా రష్ విపరీతంగా ఉంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై సెవెన్ హోటల్, వివేరా వంటి హోటల్స్ వద్ద టిఫిన్ల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. కూర్చుని తినే ఏర్పాట్లు మాత్రమే కాకుండా టేక్ అవే ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. టిఫిన్ చేయడానికి సీటు దొరకాలంటే గంటన్నర సమయం పడుతుందని చెబుతున్నారు. పెద్ద హోటల్స్ నుంచి కాకా హోటల్స్ వరకూ ఇదే పరిస్థిితి నెలకొంది.
మొబైల్ టిఫిన్ సెంటర్లు...
ఇక హైవేపై అనేక చోట్ల మొబైల్ టిఫిన్ వాహనాలు అనేకం ఉన్నాయి. వీటివద్ద కూడా రష్ అధికంగా ఉంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్లు సూర్యాపేట వరకూ ఎక్కడా టిఫిన్ చేయడానికి వీలులేకుండా పోయిందని వాపోతున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో హోటళ్ల యజమానులు కూడా రేట్లు పెంచేశారు. అయినా సరే టిఫిన్ చేయాలంటే కష్టంగా మారింది. కొందరు కడుపు మాడ్చుకుని తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. పండగ పూట పస్తులుండటమంటే ఇదే మరి అంటూ వెళ్లిపోతున్నారు.


Tags:    

Similar News