Sankranthi : మొదలయిన సంక్రాంతి సందడి.. సంబరాలతో ఉత్సాహం ఉరకలెత్తుతుందిగా
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భారతీయ సంస్కృతికి అద్దంపట్టే ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు సొంతూళ్లకు ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పటికే పల్లెల నుంచి పట్టణాల వరకూ సంక్రాంతి సందడి మొదలయింది. గోదావరి జిల్లాలు సంక్రాంతి సంబరాలకు కేరాఫ్ అడ్రస్. పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలతో పల్లె సీమలు కళకళలాడుతుంటాయి. ఉదయం నుంచి రంగవల్లులలో ఇంటి ముంగిట అలంకరించి, గంగిరెద్దుల వారి సందడితో పల్లెలన్నీ సందడిగా మారాయి. గంగిరెద్దుల వాళ్లు నేటికీ కనుమరుగవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వారు కనిపిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి పసందైన వంటకాల, పిండివంటల ఘుమఘుమలు బయట వరకూ వినిపిస్తున్నాయి.
ఈ మూడు రోజులు...
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో గోదావరి జిల్లాలలో కోడిపందేలు, గుండాల వంటి జూదాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారడం కామన్‌గా జరిగిపోతోంది. జూదం ఒక వ్యసనంగా మారడం వల్ల పండుగ అసలు పరమార్థం మరుగున పడిపోతోంది. కత్తులు కట్టి ఆడటం నేరం అయినా ఆపే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అయినా తల వంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మూడు రోజుల పాటు వదిలేస్తున్నారు. తర్వాత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు రోజుల పాటు పందెం రాయుళ్లు కుటుంబాలను వదిలేసి పందేలతోనే పండగ చేసుకుని సర్వం కోల్పోతున్నారు. అందుకే పందేలకు దూరంగా ఉండాలని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నార.
రైతన్నలు ధాన్యాన్ని ఇంటికి...
సంక్రాంతి అంటే రైతన్నలు తాము పండించిన పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకునే పండుగ. ముత్తయిదువల రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాల సందడి, పిండివంటల ఘుమఘుమలు.. ఇవే మన వారసత్వ సంపద. కోడిపందేలను కేవలం పందెం రాయుళ్ల ‘బెట్టింగ్’ అడ్డాగా కాకుండా, గ్రామీణ క్రీడగా మాత్రమే చూడాలి. జూదాన్ని విడనాడి, మన కళలను, కట్టుబాట్లను భావి తరాలకు అందించే వేదికగా సంక్రాంతిని తీర్చిదిద్దాలి. కానీ జరుగుతోంది వేరు. ప్రభుత్వం , స్థానిక సంస్థలు సంప్రదాయ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజల దృష్టిని పందేల నుంచి మరల్చవచ్చు. ఇటీవల అలాంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పడవ పందేలు, ఎడ్ల బళ్ల పోటీలు, రంగవల్లికల పోటీలు , సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రాధాన్యతనిస్తే, పండుగ ఒక సామాజిక ఉత్సవంలా మారుతుంది.