చేతులు మారిన కోట్ల రూపాయలు.. ఖరీదైన బహుమతులు.. కార్లు, బుల్లెట్ బండ్లు

సంక్రాంతి పండగ రెండు రోజుల్లోనే బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి

Update: 2026-01-15 08:41 GMT

సంక్రాంతి పండగ రెండు రోజుల్లోనే బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. కోడిపందేల్లో వందల కోట్లు చేతులు మారినట్లు సమాచారం. పెద్దయెత్తున భారీగా పందేలు కాయడంతో రెండు రోజుల్లోనూ వంద కోట్ల మేర బెట్టింగ్ లు జరిగాయని సమాచారం. రేపు కనుమ కావడంతో మరింతగా పందెంరాయుళ్లు రెచ్చిపోతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. క్రికెట్ గ్రౌండ్స్ ను మరిపించేలా కోడి పందేల బరులను ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలను సమకూర్చడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కోడి పందేలను వీక్షించేందుకు పెద్దయెత్తున జనం తరలి వచ్చారు. పోలీసుల ఆంక్షలు ఏమాత్రం పనిచేయలేదు. యధేచ్ఛగా పందేలు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే రెండు వందలకు పైగానే బరులున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో...
ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బరులు ఎక్కువగా ఈ ఏడాది ఏర్పాటు చేశారు. అయితే ఈసారి వరసగా నాలుగుసార్లు కోడిపందేల్లో నెగ్గిన కోడి యజమానికి బుల్లెట్ బండి బహుమతిగా ఇస్తున్నారు. ఫైనల్ విజేతకు ఇన్నోవా కారును బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బరుల వద్దనే ఇన్నోవా కారును కూడా ఉంచి మొదటి బహుమతి గెలిచిన కోడి యజమానికి అందచేస్తామని ప్రకటించారు. చాలా బరుల్లో పాస్ లు ఉన్న వారికి మాత్రమే గ్యాలరీలోకి అనుమతి ఇస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత జోరుగా కోడి పందేలు జరుగుతున్నాయని చెబుతున్నార. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో జనం ఇక్కడకు క్యూకట్టారు. ఇతర జిల్లాలకుచెందిన వారు కూడా ఇక్కడకు తరలి వచ్చారు.
భోజనం బరుల వద్దనే...
బరులవద్దనే మంచి భోజనాన్నిఅందిస్తున్నారు. కోడికూర, మటన్ బిర్యానీ, రొయ్యల వేపుడు, చేపల పులుసు తో పాటు గోదావరి జిల్లాలకు చెందిన రుచులన్నీఅక్కడకు వచ్చిన వారికి అందిస్తున్నారు. ఇక మద్యం కూడా అక్కడే అందుబాటులో ఉంది. కాస్ట్ లీ మద్యం నుంచి నాసిరకం సరుకు వరకూ లభ్యమవుతుంది.ఖరీదైన కార్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ అత్యంత ఖరీదైన కార్లు కూడా బరుల వద్ద కనిపిస్తున్నాయి. అంతా క్యాష్ తోనే పందేలు కాస్తున్నారు. కొన్ని చోట్ల గూగుల్, పేటీఎం ద్వారా పే చేసే సౌకర్యం కల్పించినా ఎక్కువ మంది కరెన్సీ కట్టలనే తీసుకు వచ్చి పందేలు కాస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో జరిగిన ఒక బరిలో ఒక్క పందెంలో దాదాపు కోట్ల రూపాయలుచేతులు మారినట్లు తెలిసింది. కరెన్సీని లెక్కపెట్టేందుకు అక్కడకు మనీ కౌంటింగ్ మిషన్లు కూడా తెచ్చారు.


Tags:    

Similar News