హైదరాబాద్ - విజయవాడ మార్గంలో పెరిగిన వాహనాల రద్దీ
సంక్రాంతి పండగకి సొంతూళ్లకు హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరారు
సంక్రాంతి పండగకి సొంతూళ్లకు హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నగరం నుంచి భారీగా వాహనాలు క్యూ కట్టాయి. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి టోల్ గేట్ వద్ద మొత్తం పదహారు టోల్ బూత్ లు ఉండగా, అందులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వైపు పదకొండు టోల్ బూత్ ఓపెన్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే టోల్ బూత్ లను ఐదింటిని మాత్రమే ఓపెన్ చేశారు.
సెలవులు ప్రకటించడంతో...
విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు పట్నం వాసులు బయలుదేరారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ నేడు కూడా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజాతో పాటు ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద కూడా వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి మూడు సెకన్లకు ఒక వాహనం వెళ్లేలా టోల్ గేట్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను జాతీయ రహదారిపై నిలిపి ఉంచకుండా పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు.
బస్సులు... రైళ్లు కూడా...
మరొకవైపు స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో రాత్రి నుంచి ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నేడు పదో తేదీ కావడంతో పాటు ఇంకా పండగకు మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో నిన్నటి నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న వారితో పాటు అప్పటి కప్పుడు వచ్చే వారి నుంచి ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు అత్యధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకూ టిక్కెట్ ను వసూలు చేస్తున్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లతో పాటు అన్ని రైళ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి.