బండి సంజయ్ మార్పుపై మర్మమేమిటి?

బండి సంజయ్‌ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాక.. తెలంగాణలో బిజెపికి మునుపెన్నడు లేని విధంగా ఇమేజ్ వచ్చింది.

Update: 2023-07-17 11:22 GMT

బండి సంజయ్‌ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాక.. తెలంగాణలో బిజెపికి మునుపెన్నడు లేని విధంగా ఇమేజ్ వచ్చింది. బండి 2005లో కరీంనగర్ 48వ డివిజన్‌కు మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్‌గా ఉన్న సమయం నుంచే సంజయ్‌ దూకుడుగా వ్యవహంచే వారు. ఆ దూకుడుతోనే యువకులలో క్రేజ్ పెంచుకుని కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారు. అప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బండి సంజయ్ పేరు అందరి నోళ్ళల్లో వినిపించింది. తెలంగాణలో అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ని వెనక్కినెట్టి.. బీజేపీ పార్టీని ముందుకు తెచ్చారు.

సంజయ్ నిర్వహించిన ప్రోగ్రామ్స్ పార్టీలోనే కాదు, రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. అయితే తెలంగాణలో బీజేపీ పార్టీకి అంతటి హైప్ తెచ్చిన బండి సంజయ్‌ని బీజేపీ జాతీయ నాయకత్వం అకస్మాత్తుగా మార్చేసింది. దుబ్బాక, హుజురాబాద్ బైపొల్‌ విజయం సాధించి బీజేపీ బాలాన్ని చూపాడు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలలో అధిక సంఖ్యలో కార్పోరేటర్లను గెలిచి బీఆర్ఎస్ నాయకత్వానికి షాక్ ఇచ్చారు. గతంలో గంగాపురం కిషన్ రెడ్డి మూడుసార్లు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న టైంలో బీజేపీలో ఇంత దూకుడు లేదు. అయితే ఇప్పుడు బండి ప్లేస్‌లో మళ్ళీ కిషన్ రెడ్డినే బీజేపీ పార్టీ హైకమాండ్ నియమించింది.

బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో.. బీజేపీ అధిష్ఠానంపై బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలక్షన్ సమయం దగ్గరపడుతుండటంతో బండి సంజయ్‌ని ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే బండి సంజయ్ తన ఒంటెత్తు పోకడలతో పార్టీలోని సీనియర్ నాయకులకు దూరమయ్యారని.. తన సొంత జిల్లాకు చెందిన సీనియర్ నేత ఈటెల రాజేందర్‌తో దూరం పెరిగిందని, ఈ క్రమంలోనే పార్టీ అధిష్ఠానం అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. బండి సంజయ్ వ్యవహరించిన తీరే అధ్యక్ష పదవికి దూరం చేశాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి వరిస్తుందా?.. మంత్రి పదవి రాకపోతే పరిస్థితి ఏంటీ..? రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా గెలుపు సాధ్యమేనా? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై సెంటిమెంట్ వస్తుందా? అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News