పొత్తు తర్వాత?

టీడీపీ, జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడటంతో ఇప్పుడు గుడివాడ హాట్ టాపిక్ గా మారింది.

Update: 2023-09-15 11:38 GMT

టీడీపీ, జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడటంతో ఇప్పుడు గుడివాడ హాట్ టాపిక్ గా మారింది. గుడివాడలో టీడీపీ పోటీ చేస్తుందా? లేక జనసేన పోటీ చేయనుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి కొడాలి నానిని ఢీకొట్టాలంటే సరైన అభ్యర్థిని నిలబడితే ఈసారి గెలుపు ఖాయమన్న విశ్వాసం తెలుగు తమ్ముళ్లలో కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ నుంచి టీడీపీ బరిలోకి దిగి కొడాలిని ఓడించాలన్న కసి తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. ఆ దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గుడివాడలో…
టిడిపి అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు కొరకరాని కొయ్య‌గా మారాడు మాజీ మంత్రి.. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అన్నా.. లోకేష్ అన్నా.. తెలుగుదేశం శ్రేణులు అన్నా విమర్శించేందుకు ఎప్పుడు కొడాలి నాని ముందు ఉంటాడు. వైసిపి వాళ్ళు చంద్రబాబు, లోకేష్ పై ఎన్ని విమర్శలు చేసినా కొడాలి నాని విసిరే ఆ పంచులు చాలా ఘాటుగా ఉంటాయి. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు ఎలా ? కోరుకుంటున్నారో అలాగే గుడివాడలో కొడాలి నాని ఓడిపోవాలని అంతే బలంగా కోరుకుంటున్నారు.
పదేళ్లుగా..
గత 10 సంవత్సరాలుగా కొడాలి నాని గుడివాడలో వైసీపీ నుంచి పాతుకుపోయి ఉన్నారు. గత రెండు ఎన్నికలలోను వైసీపీ నుంచి వరుసగా ఘనవిజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అధికార పార్టీ నేతగా ఉండడంతో నానికి ఎదురు లేకుండా పోయింది. ఒక్కోసారి మరీ ఘాటుగా విమర్శలు చేస్తూ విమర్శలకు గురవుతున్నా నాని తన తీరు మాత్రం మార్చుకోవటం లేదు. ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నానిని ఓడించడానికి చంద్రబాబు జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో వేసిన‌ స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు.
క్యాస్ట్ ఈక్వేషన్స్…
జగన్ గత ఎన్నికలలో చాలా నియోజకవర్గాలలో రెండు కులాల ఈక్వేషన్ పాటించారు. అంటే భర్త ఒక కులం అయితే.. భార్య మరొక కులం ఉన్న వారికే సీట్లు ఇచ్చారు. శింగనమల - చిలకలూరిపేట - తాడికొండ - కళ్యాణదుర్గంలో ఇదే స్ట్రాటజీ అమలు చేశారు. ఇప్పుడు హిందూపురంలో కూడా ఇదే ఈక్వేష‌న్‌తో బాల‌య్య‌ను ఓడించాల‌ని చూస్తున్నారు. ఇక ఇప్పుడు గుడివాడలో చంద్రబాబు కూడా సేమ్ జగన్ స్ట్రాటజీతోనే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.
కమ్మ - ఎస్.సి…
గుడివాడలో కమ్మ సామాజిక వర్గం అధిపత్యం ముందు నుంచి ఎక్కువ. అందుకే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్నారై వెనిగండ్ల రాముకు సీటు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరిగిన చర్చలలో రాము అయితేనే నానిని ఓడిస్తారని పలు రకాల నివేదికలు చూసిన చంద్రబాబు చివరకు రాము అభ్యర్థిత్వం ఖరారు చేసినట్టు సమాచారం. రాము భార్య మాల సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె గత ఏడాదికాలంగా అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీలో ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాల‌తో చొచ్చుకుపోతున్నారు.
కాపులు కూడా…
ఇటు రాము కూడా సేవా కార్యక్రమాలతో పార్టీ కేడ‌ర్ కు బాగా దగ్గరయ్యారు. ఇటు సామాజికపరంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు ఆర్థిక, అంగబ‌లాల్లోనూ రాము బలంగా ఉండడంతో రాముకి సీటు ఇవ్వాలని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జనసేన కూడా తమతో కలసి రావడంతో కాపు సామాజికవర్గం ఓట్లు కూడా కలసి వస్తాయని అంచనాలో ఉన్నారు. అందుకే అక్కడ పార్టీ కోసం ఎంతో త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయం చూపాలని కూడా స్థానిక నేత‌లు కోర‌గా అందుకు బాబు ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News