Chandrababu : అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు మూడు విధానాలు.. గెలుపు మంత్ర అదేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు

Update: 2024-02-19 05:03 GMT

Teludu desam party(TDP) Strategy:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పొత్తుల నుంచి సీట్ల సర్దుబాటు ఒక ఎత్తైతే... అభ్యర్థుల ఎంపికలో ఆయన తలమునకలై ఉన్నారు. మరోవైపు మ్యానిఫేస్టో రూపకల్పనపై కూడా ఫోకస్ పెట్టారు. ఇలా ఒకరకంగా చంద్రబాబు అష్టావధానం చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఏడు పదుల వయసు దాటినా ఆయన ఇప్పటికీ పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్నారు. పార్టీ కోసం, తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆయన తన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో మాదిరిగా కేవలం ఆర్థికంగా బలమైన నేతలు మాత్రమే కాదు. సామాజికవర్గాల సమీకరణను కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకుని సెలక్ట్ చేస్తున్నారు.

ఎంపిక ఇలా....
ఇందుకోసం మూడు విధానాలను చంద్రబాబు అనుసరిస్తున్నారని అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఒకటి.. సీనియర్లయినా గెలుపు కష్టమని తేలితే పక్కన పెట్టడం. 2. కొత్త నేతలకు అవకాశం ఇవ్వడం. 3. సామాజికవర్గాల సమతూకం పాటించడం. ఈ మూడు సూత్రాలను విధిగా పాటించాలన్న నిర్ణయంతో ఆయన జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పాత జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఆ జిల్లాల్లో అన్ని సామాజికవర్గాల వారికీ అవకాశం దక్కేలా టిక్కెట్‌లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకోసం చంద్రబాబు 1999 ఎన్నికల్లో చేసినట్లు తటస్థులను కూడా కొన్నిచోట్ల అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు.
తటస్థులకు కూడా...
అందులో మేధావులు, జర్నలిస్టులు, ప్రజలతో మమేకం అవుతున్న వారి పేర్లను ఆయన జిల్లాల వారీగా తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఒక జర్నలిస్టును ఇన్‌ఛార్జిగా నియమించారు. పూతలపట్టు ఇన్‌ఛార్జిగా ఒక ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టుకు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించి జనంలోకి పంపారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అనేక మంది పాత నేతలు పోటీ పడుతున్నా అక్కడ ఇన్నాళ్లూ పోరాటం చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో సీనియర్ నేతలు దేవినేని ఉమ మహేశ్వరరావును కూడా పక్కకు తప్పించేందుకు సిద్దమయ్యారంటే ఆయన ఎంత సీరియస్ గా టిక్కెట్ల కేటాయింపు విషయంలో చర్యలు తీసుకుంటున్నారంటే చెప్పనక్కర లేదు.
మైనారిటీలకు...
అలాగే ముస్లిం మైనారిటీలకు కూడా ఈసారి రెండు మూడు సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లె టిక్కెట్ ను ముస్లిం సామాజికవర్గానికి కేటాయించాలని డిసైడ్ అయ్యారు. షాజహాన్ భాషాను ఆయన మదనపల్లె అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిసింది. షాజహాన్ ఆరు నెలల క్రితమే ఆయన పార్టీలో చేరినా టిక్కెట్ మాత్రం భాషాకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో సొంత సామాజికవర్గం వారిని పక్కన పెట్టాలని కూడా డిసైడ్ అయ్యారు. గెలవాలంటే సోషల్ ఇంజినీరింగ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. మరి జాబితాలో కొత్త వారి పేర్లు ఎక్కువగా ఉంటాయన్న ప్రచారం మాత్రం పార్టీలో ఎక్కువగా వినిపిస్తుంది.


Tags:    

Similar News