Nara Lokesh : లోకేష్ అంటీముట్టనట్లు ఉంటున్నారా? ఫోన్‌‌కు కూడా స్పందించడం లేదా?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత కొద్ది రోజులుగా పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం లేదు

Update: 2024-02-01 07:37 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత కొద్ది రోజులుగా పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం లేదు. యువగళం పాదయాత్ర పూర్తయిన తర్వాత ఆయన లీడర్స్ తో గ్యాప్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. విజయవాడకు వచ్చినా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు. పార్టీ పెద్దగా కనిపించకపోవడం, యాక్టివ్ గా లేకపోవడానికి కారణాలపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఆయన ఇటీవల అమెరికా వెళ్లి వచ్చారు. అమెరికాలో నిధుల సేకరణకు ఆయన వెళ్లినట్లు వార్తలు వచ్చినా.. దానిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఈరోజు మాత్రం శ్రీశైలం దేవస్థానాన్ని ఆయన సందర్శించారు.

టిక్కెట్ల కేటాయింపులో...
అయితే నారా లోకేష్ పై ఈసారి నేతల నుంచి వత్తిడి ఎక్కువగా ఉంటుంది. టిక్కెట్ల కేటాయింపు విషయంలో తమ పేర్లను సిఫార్సు చేయాలంటూ ఆయనను లీడర్లు ఎక్కువ మంది కలిసేందుకే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాదాపు ఏడాదికిపైగా యువగళం పాదయాత్ర చేయడం, నేతలతో మమేకం కావడంతో లోకేష్ తో కొందరి నేతల మధ్య రాజకీయంగా బంధం పెరిగింది. ఆయన సభలకు, పాదయాత్రకు జనాన్ని సమీకరించడంలో కాని, వాళ్ల నియోజకవర్గంలో సక్సెస్ చేయడంలో గాని అనేక మంది నేతలు బాగానే పనిచేశారు. అనేక చోట్ల వివిధ వర్గాలతో సమావేశాలు జరిపినప్పుడు కూడా దానిని విజయవంతమవ్వడానికి లోకల్ లీడర్స్ భాగస్వామ్యం కూడా ఉంది.
తనకు సన్నిహితులైన...
దీంతో పాటు లోకేష్ కు అత్యంత సన్నిహితులైన వారు కూడా చాలా మంది నేతలున్నారు. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు, బాలయోగి తనయుడు హరీశ్, బుద్దా వెంకన్న, పరిటాల శ్రీరామ్, జేసీ తనయులు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, టీజీ భరత్ లాంటి వాళ్లు సన్నిహితంగా ఉంటారు. అయితే ఈసారి టిక్కెట్లు ఎవరికి వస్తాయన్నది తెలియదు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులతో బరిలోకి దిగనుంది. జనసేనతో ఇప్పటికే పొత్తు ఖరారయింది. బీజేపీ కూడా వస్తే దానికి కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అంటే దాదాపు యాభై అసెంబ్లీ సీట్లు, ఐదు నుంచి పది వరకూ పార్లమెంటు సీట్లు పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించాల్సి ఉంటుంది. తాము అనుకున్న వారందరికీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఈసారి మాత్రం ఉండదు.
సిఫార్సు చేసినా...
తాను సిఫార్సు చేసినా పొత్తులో భాగంగా పార్టీలు ఆ స్థానాన్ని కోరితే దానికి అడ్డుపడేందుకు కూడా పెద్దగా అవకాశం లేని పరిస్థితులున్నాయి. అందుకే లోకేష్ లీడర్లతో కొంత గ్యాప్ మెయిన్‌టెయిన్ చేస్తున్నట్లు తెలిసింది. తాను ఖచ్చితంగా హామీ ఇచ్చిన కొందరి పేర్లను మాత్రం ఆయన చంద్రబాబుకు సిఫార్సు చేసే అవకాశాలున్నాయి. అయినా చివరి నిమిషం వరకూ ఆ సీటు తాను సూచించిన వారికి దక్కుతుందన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో వత్తిడి ఎక్కువగా ఉంటుందని భావించిన లోకేష్ కొన్ని రోజులు అమెరికాలోనూ మరికొన్ని రోజులు హైదరాబాద్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. పొత్తులో భాగంగా స్థానాలు ఖరారయిన తర్వాతనే ఆయన లీడర్లతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ లోకేష్ అంటీ ముట్టనట్లు ఉంటారన్నది పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


Tags:    

Similar News