Dharmavaram : ధర్మవరం ఎఫెక్ట్.. వరదాపురం సూరికి పరిటాల శ్రీరామ్ సహకరిస్తారా?

ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలు మారాయి. పరిటాల శ్రీరామ్ కుచెక్ పెట్టనున్నారు

Update: 2024-01-05 13:14 GMT

ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలు మారాయి. రాయలసీమలో అత్యధికంగా సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఆయన తన పూర్వపు మైండ్ సెట్్ను మార్చుకుంటున్నారు. గతంలో చంద్రబాబు పార్టీని కష్టకాలంలో వదిలిపెట్టిన వారిని ఎవరినీ తిరిగీ తీసుకోబోనని చంద్రబాబు ప్రకటించారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో కొందరు పార్టీని వదిలి వెళ్లిపోయారు. అందులో వరదాపురం సూరి ఒకరు. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయి ఐదేళ్లు సేఫ్ గా ఉండటం కోసం భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.

పార్టీని వీడి వెళ్లడంతో...
దీంతో ధర్మవరం నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ ను చంద్రబాబు పార్టీ ఇన్ ఛార్జిగా నియమించారు. రాప్తాడు నుంచి తన తల్లి సునీతమ్మ, ధర్మవరం నుంచి తాను పోటీ చేస్తానని, ఇద్దరం అసెంబ్లీలో అడుగు పెడతామని పరిటాల శ్రీరామ్ పదే పదే తన అనుచరులకు చెప్పుకుంటూ వచ్చారు. ధర్మవరంలో పరిటాల కుటుంబానికి బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో ఆయననే ఇన్ ఛార్జిగా నియమించారు. దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ఆయన అక్కడే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఒక వైపు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు చేస్తూనే మరోవైపు బీజేపీ నేత వరదాపురం సూరిపైన కూడా ఆయన విరుచుకుపడుతూ వస్తున్నారు.
సూరిని చేర్చుకుంటే...
వరదాపురం సూరిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన పలు సందర్భాల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలను చంద్రబాబు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని భావించేటట్లే ధర్మవరంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరదాపురం సూరిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసింది. వరదాపురం సూరి, పరిటాల శ్రీరామ్ కలసి పనిచేస్తేనే కేతిరెడ్డిని ఓడించడం సాధ్యమవుతుందని సర్వేలు కూడా చెప్పడంతో సూరి ఎంట్రీ త్వరలోనే ఖాయమని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఒకే కుటుంబానికి ఒకే...
అంతేకాకుండా ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని చంద్రబాబు కూడా డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందులోనూ పరిటాల ఫ్యామిలీ ఒకటి అని చెబుతున్నారు. రాప్తాడు నుంచి పరిటాల సునీతను పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిటాల శ్రీరామ్ కు నామినేట్ పదవి ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు పరిటాల వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెట్టి ఇప్పుడు వరదాపురం సూరిని తీసుకుంటే ఎలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ధర్మవరం టీడీపీలో సూరి, శ్రీరామ్ ల మధ్య సీటు కోసం పరోక్ష యుద్ధం మొదలయిందనే చెబుతున్నారు.


Tags:    

Similar News