Chandrababu : చంద్రబాబుకు తప్పడం లేదు...గెలవాలంటే ఈక్వేషన్లు మార్చాల్సిందే మరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ఎన్నికల్లో సొంత సామాజికవర్గం నేతలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది

Update: 2024-02-17 07:44 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ఎన్నికల్లో సొంత సామాజికవర్గం నేతలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఒకవైపు సామాజికవర్గాల సమీకరణాలతో వెళుతుంటే తాను పాత పద్థతుల్లోనే వెళితే కష్టమని భావించి ఆయన కూడా బీసీలకు ఈసారి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం నేతలు బలంగా ఉన్నప్పటికీ అక్కడ బీసీలకు చోటు కల్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలకు సంకేతాలు వెళ్లాయి. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోతే పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

బీసీలకు ప్రాధాన్యమిస్తే....
బీసీలు, రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. జగన్ కొన్ని వర్గాలను దగ్గరకు చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు జగన్ పై ఆగ్రహంతో ఉన్న వర్గాలను తమ వైపునకు తిప్పుకోవాలన్న ప్రయత్నిం చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాల్లోనూ కమ్మ సామాజికవర్గం తక్కువ ఉండేలా చూసుకునేందుకు ఆయన జాబితాను తయారుచేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పార్లమెంటు స్థానాలు ఎక్కువ మంది కమ్మ సామాజికవర్గాలక వారికే కేటాయిస్తూ రావడం కొన్నేళ్ల నుంచి టీడీపీలో సంప్రదాయంగా వస్తుంది.
ఈసారి ఈ సీట్లలో కొన్నింటిని...
గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం పార్లమెంటు స్థానాలు అనాదిగా టీడీపీ కమ్మ సామాజికవర్గానికి కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి గుంటూరు, విజయవాడ తప్పించి మిగిలిన స్థానాల్లో కమ్మ వారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఏలూరు నుంచి ఈసారి యాదవ సామాజికవర్గానికే కేటాయించడానికి సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని నిర్ణయించారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనలకు కొన్ని స్థానాలను కేటాయిస్తుండటంతో ఈసారి కమ్మ సామాజికవర్గానికి గతంలో ఇచ్చిన స్థానాలు దక్కే అవకాశాలు కన్పించడం లేదు. పార్టీకి ఆర్థికంగా ఆదుకునేది ఆ సామాజికవర్గం వారే. డొనేషన్ల రూపంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు ఇచ్చింది వాళ్లే.
అసంతృప్తి ఉన్నప్పటికీ...
అయితే దీనిపై కమ్మ సామాజికవర్గంలో దీనిపై అసంతృప్తులు బయలుదేరినట్లు తెలిసింది. తమకు సంప్రదాయంగా వస్తున్న సీట్లను వదులుకుని వేరే సామాజికవర్గాలకు కట్టబెడితే వారి పెత్తనాన్ని తాము అంగీకరించబోమని కొందరు నేతలు నేరుగా చంద్రబాబు ఎదుటే కుండబద్దలు కొడుతున్నారని తెలిసింది. అయితే గెలవాలంటే సోషల్ ఇంజినీరింగ్ ఈసారి అవసరమని, అందుకే మనం సీట్లను త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఆయన వాళ్లకు నచ్చ చెప్పే ప్రయత్నంచేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు పార్లమెంటును ఇతర సామాజికవర్గాల వారికి ఇస్తే ఊరుకోబోమని కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు కొందరు ఏకంగా అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ పై రెడ్లు ఎలాగయితే ఆగ్రహంగా ఉన్నారో.. కమ్మ సామాజికవర్గంలోనూ చంద్రబాబు సీట్లను ఇతరులకు కేటాయిస్తే అసంతృప్తి తప్పదని అంటున్నారు. అయితే జగన్ ను గెలిపించుకోవడం కంటే... చంద్రబాబును సీఎంగా చేయడం మంచిదని భావించి ఇప్పుడిప్పుడే కొంత గాడిలో పడుతున్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News