గెలిస్తే అదేనా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో చాలామంది శాసనసభ టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.

Update: 2023-09-28 04:18 GMT

నిజానికి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాల్సిన వాళ్లంతా ఈసారి అసెంబ్లీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో శాసనసభ టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి కోసమో.. వీలయితే ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశ్యంతో అందరూ అసెంబ్లీ వైపే చూస్తున్నారు. అందుకే గాంధీభవన్ లో నేతల సందడి మామూలుగా లేదు. ఎన్నికల సమయం గడిచే కొద్ది కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడటం, సర్వేలు కూడా సానుకూలంగా ఉండటంతో సీనియర్ నేతలందరూ ఎమ్మెల్యేల టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హేమాహేమీలు టిక్కెట్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఒకరు.

రెండుసార్లు గెలిచి...
ఆయన రెండుసార్లు నిజామాబాద్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004, 2009లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు సాధన కోసం ఆయన చేసిన ప్రయత్నాలు కూడా అంతే ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం జరిగిన ఎన్నికల నుంచి ఆయనకు డౌన్ ఫాల్ మొదలయింది. 2014లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి తప్పలేదు. దీంతో ఆయన నిజామాబాద్ పార్లమెంటు అంటేనే విసుగుపుట్టినట్లుంది.
ప్రజల్లో లేకుండా...
కాంగ్రెస్ ఓటమి తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. విదేశాల్లో ఉన్న తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. పెద్దగా జనంలో తిరిగింది లేదు. చేసింది లేదు. ఎన్నికల సమయానికి రావడం.. హడావిడి సృష్టిస్తుండటం మామూలుగా మారింది. రాష్ట్ర రాజకీయాలను అస్సలు పట్టించుకోలేదు. పార్టీ కార్యక్రమాల జోలికి కూడా పోలేదు. రాహుల్ గాంధీ కోటరిలో సభ్యుడిగా మారడంతో ఆయనకు గాంధీభవన్ లో గౌరవం మాత్రం తగ్గదు. కానీ జనంలో లేకుండా పార్టీలోనూ, హైకమాండ్ లోనూ పట్టు ఉంటే ప్రయోజనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఇవేమీ పట్టించుకోని మధుయాష్కి ఈసారి కూడా ఎన్నికలకు ముందు హడావిడి చేస్తున్నారు.
ఎల్బీనగర్ నుంచి...
నిజామాబాద్ పార్లమెంటు నుంచి కాకుండా ఈసారి ఎల్బీనగర్ శాసనసభ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ కు కొంత అనుకూలమైన నియోజకవర్గం కావడంతో యాష్కి ఆ నియోజకవర్గంపై కన్నేశారు. అక్కడ ఇప్పటి వరకూ పనిచేసిన నేతలను పక్కన పెట్టి తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ అధినాయకత్వంపై వత్తిడి తెస్తున్నారు. దీంతో పాటు బీసీ కార్డు కూడా బలంగా వాడుతున్నారు. మధు యాష్కీ చేస్తున్న ఈ రకమైన ప్రయత్నాలు మిగిలిన నేతల్లో అసంతృప్తి బయలుదేరింది. ఆయనకు వ్యతిరేకంగా గాంధీభవన్ లో పోస్టర్లు కూడా వెలిశాయి. అయినా సరే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన తన ప్రయత్నాలు మాత్రం మానలేదు. మరి యాష్కి బరిలోకి దిగితే మిగిలిన నేతలు సహకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశ, ఎల్బీనగర్ అయితే సులువని భావించి ఎల్బీనగర్ కు షిఫ్ట్ అయ్యారంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
Tags:    

Similar News