Ganta Srinivasa Rao : గంటా కీలక సమావేశం నేడు... నిర్ణయం ఎలా ఉంటుందో?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు తన ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నారు

Update: 2024-03-14 04:09 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు తన ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కలేదు. నేడు రెండో విడత జాబితాలో గంటా శ్రీనివాసరావు పేరు ఉంటే సరే.. లేకుంటే భవిష్యత్ కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు.ఈ మేరకు ఇప్పటికే తన ముఖ్యఅనుచరులు, సన్నిహితులతో సమావేశం కావాలని నిర్ణయించారు. తన రాజకీయ భవిష్యత్ పై వారితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

నియోజకవర్గాలు మారుస్తూ...
గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గంటా ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మార్చడం అలవాటు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. చోడవరం నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత భీమిలీకి తన మకాం మార్చి అక్కడి నుంచి 2014 లో ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 2019 ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గాన్ని మార్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో నెగ్గారు.
చీపురుపల్లి నుంచి....
అయితే ఈసారి గంటా శ్రీనివాసరావును పార్టీ అధినాయకత్వం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని టీడీపీ అధినాయకత్వం సూచించింది. అయితే ఇందుకు గంటా శ్రీనివాసరావు అంగీకరించడంలేదు. తాను విశాఖ జిల్లాను వదిలి వెళ్లేందుకు సుముఖంగా లేనని అధినాయకత్వంతో చెప్పి వచ్చారు. దీంతో ఆయనకు ఎక్కడ సీటు కేటాయిస్తారన్న దానిపై ఇప్పుడు గంటా అనుచరుల్లో టెన్షన్ మొదలయింది.
పొత్తు ఉండటంతో...
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉండటంతో గంటా శ్రీనివాసరావుకు విశాఖ జిల్లాలో అవకాశం దక్కే ఛాన్స్ ఉండదని భావిస్తున్న సమయంలో ఆయన అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. తనకు టిక్కెట్ తాను ఆశించిన స్థానంలో అదీ విశాఖ జిల్లాలో దక్కకుంటే గంటా శ్రీనివాసరావు సీరియస్ డెసిషన్ తీసుకునే అవకాశముందంటున్నారు. అందుకే రెండో జాబితాలో ఆయనకు పేరు ఉంటుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గంటా శ్రీనివాసరావు మాత్రం ఈరోజే ఆత్మీయులతో సమావేశం పెట్టడం మరో విశేషంగా చెప్పుకోవాలి.


Tags:    

Similar News