JD Lakshminarayana : ఆయన పోటీలో ఉంటే ఆ ఓట్లన్నీ గంపగుత్తగా అటేనా

సీీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Update: 2023-12-01 12:34 GMT

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన విశాఖపట్నం నుంచే పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఆయన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. కొత్త పార్టీ అవసరం ఉందని ఇటీవల ఆయన చేసిన ప్రకటన కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖ పార్లమెంటు నుంచి జనసేన తరుపున ఇప్పటికే పోటీ చేసి ఓటమి పాలయిన తర్వాత ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వచ్చేశారు. స్వతంత్రంగా పార్టీ పెట్టడమా? లేక ఆమ్ ఆద్మీ వంటి పార్టీలో చేరి ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా? అన్నది ఆసక్తి కరంగా మారింది.

స్వతంత్ర అభ్యర్థిగా...
ఆయన టీడీపీ, వైసీపీలు కాకుండా కొత్త పార్టీ పెట్టి అభ్యర్థిగా పోటీ చేయడానికి మాత్రం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖపట్నంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అక్కడి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విష‍యంలోనూ ఆయన వైఖరి స్పష్టంగానే ఉంది. అవసరమైతే బిడ్ వేస్తామని కూడా ఆయన ప్రకటించారు. అలా ఆయన విశాఖ నుంచే మరోసారి పోటీ చేయడానికి జేడీ లక్ష్మీనారాయణ రెడీ అవుతున్నారు. ఈసారి జనసేన, టీడీపీ పొత్తు ఖరారు కావడంతో ఆయన కొత్త పార్టీ నుంచే అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆయన పోటీలో ఉంటే ఎవరికి నష్టమన్న లెక్కలు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వేసుకుంటుండటం విశేషం.
సొంత ఇమేజ్ తో...
జేడీ లక్ష్మీనారాయణకు సొంత ఇమేజ్ ఉంది. ఆయనకంటూ కొంత ఓటు బ్యాంకు సహజంగానే ఉంటుంది. నిజాయితీ కలిగిన అధికారిగా పేరుండటమే కాకుండా, సామాజికవర్గం పరంగా కూడా కొంత కలసి వచ్చే అంశమే. పైగా విశాఖ వంటి నగరంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉండటం కూడా జేడీకి కలసి వచ్చే అంశంగానే పరిగణిస్తున్నారు. గత ఎన్నికల్లో జేడీ వల్లనే టీడీపీ అభ్యర్థి భరత్ తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పురంద్రీశ్వరికి 34 వేలు ఓట్లు రాగా, జనసేన తరుపున బరిలో నిలిచిన జేడీ లక్ష్మీనారాయణకు 2.88 లక్షల ఓట్లు వచ్చాయి. కొంత పార్టీ, మరికొంత వ్యక్తిగత ఇమేజ్‌తోనే ఆయనకు ఆ స్థాయి ఓట్లు వచ్చాయి.
టీడీపీ ఆహ్వానిస్తుందా?
ఇప్పుడు జనసేన, టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, జేడీ స్వత్రంత అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ కూటమికే నష్టమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. జనసేన ఓట్లన్నీ జేడీకే పడతాయన్న టాక్ బలంగా వినపడుతుంది. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా లక్ష్మీనారాయణ సొంతం చేసుకునే అవకాశముంది. అందువల్ల జేడీకి వచ్చే ప్రతి ఓటు టీడీపీ, జనసేన కూటమికి పడేవేవన్న లెక్కలు బాగా వినపడుతున్నాయి. అందుకే టీడీపీ జేడీని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమయిందని మొన్నటి వరకూ వార్తలు హల్ చల్ చేశాయి. కానీ దానిపై జేడీ క్లారిటీ ఇచ్చేశారు. ఆయన కొత్త పార్టీ ఎప్పుడు పెడతారు? ఏ పార్టీ అన్నది ఇప్పుడు పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయింది.
Tags:    

Similar News