CM Ramesh : కడప టు అనకాపల్లి... ఇంటి పేరునే బ్రాండ్ గా మార్చుకున్న లీడర్‌‌ను జనం ఆదరిస్తారా?

మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు దక్కింది. కడప జిల్లాకు చెందిన ఆయన ఉత్తరాంధ్రలో పోటీ చేస్తున్నారు

Update: 2024-03-25 07:46 GMT

మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు దక్కింది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ఉత్తరాంధ్రలో పోటీ చేస్తున్నారు. అదీ తొలిసారి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన సీఎం రమేష్ తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభించారు. పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేష్ టీడీపీకి కొన్ని దశాబ్దాల పాటు వెనక ఉండి సేవలందించారు. ఆర్థికంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇప్పటికీ కడప జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ ప్రభావం ఉంటుందన్నది పార్టీ నేతలు కూడా కాదనలేని వాస్తవం. అంతగా ప్రభావం చేసే నేత సీఎం రమేష్.

అంతా తానే అయి...
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రమేష్ అంతా తానే అయి వ్యవహరించారు. చంద్రబాబుకు తల్లో నాలుకగా వ్యవహరించారంటారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనడానికి సీఎం రమేష్ ఉపయోగపడతాడని భావించిన చంద్రబాబు ఆయనను రాజకీయంగా ఎదిగేందుకు ఊతమిచ్చారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో అధికారంలోకి రాగానే ఆయన చట్టసభల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్ తొలిసారి పెద్దల సభలోకి కాలుమోపారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కాగానే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. అందరితో పాటు సీఎం రమేష్ చేరారు.
అలయన్స్ ఏర్పడటానికి...
ఆయన తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవటానికే బీజేపీలో చేరారని విమర్శలు వినిపించినా ఆయన బీజేపీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడం, ఆయనకు మరోసారి అవకాశం దక్కదని తెలియడంతో ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఏర్పడటానికి కూడా సీఎం రమేష్ హస్తినలో తనకున్న పరిచయాలను ఉపయోగించి కారణమని అంటారు. అలాంటి సీఎం రమేష్ కు ఈసారి అనకాపల్లి సీటు దక్కింది. అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. కూటమి అభ్యర్థి కావడంతో ఆయన తన గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ప్రత్యర్థి ఖారరు కాకపోవడంతో...
తొలుత జనసేన నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా పట్టుబట్టి అధినాయకత్వంతో చెప్పించి ఈ స్థానాన్ని సీఎం రమేష్ సాధించుకున్నారు. సీఎం రమేష్ ను అనకాపల్లి లో నాన్ లోకల్ కింద చూస్తారా? అన్న అనుమానం మాత్రం ఉంది. లోకల్, నాన్ లోకల్ అంశం వస్తే అది రమేష్ కు మైనస్ అవుతుంది. అదే సమయంలో ఇక్కడ ఇంత వరకూ వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ ఒక్క స్థానాన్ని జగన్ పెండింగ్ లో పెట్టారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని బట్టి వైసీపీ అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆ ఒక్కస్థానాన్ని జగన్ హోల్డ్ లో పెట్టారు. సీఎం రమేష్ ఆషామాషీ నేత కాదు. ఆర్థికంగానే కాదు.. రాజకీయంగా కూడా కూటమి అభ్యర్థి కావడంతో ఆయనతో పోటీ పడాలంటే సరైన అభ్యర్థిని వైసీపీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. లేదంటే ఎన్నిక ఏకపక్షమే అవుతుంది. జగన్ మాత్రం లోకల్స్ కే ఈ సీటు ఇచ్చేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.



Tags:    

Similar News