మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌.. రాహుల్‌ గాంధీ సంచలన కామెంట్స్‌

దేశాన్ని ఐక్యంగా ఉంచాలని మనం తపిస్తుంటే.. మిగతా వాళ్లు దేశంలో విద్వేషం, విభజన తీసుకురావాలనుకుంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌

Update: 2023-07-02 13:55 GMT

దేశాన్ని ఐక్యంగా ఉంచాలని మనం తపిస్తుంటే.. మిగతా వాళ్లు దేశంలో విద్వేషం, విభజన తీసుకురావాలనుకుంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని ప్రేమతో ముందుకు తీసుకువెళ్లడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోషంగా ఉందన్నారు రాహుల్‌ గాంధీ. ఖమ్మం జన గర్జన సభలో రాహుల్‌ ప్రసంగించారు. జోడోయాత్రకు పార్టీ కార్యకర్తలు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. జోడోయాత్రతో దేశ సమాఖ్య నినాదాన్ని తీసుకెళ్లామన్నారు. దేశమంతా భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచిందన్నారు. మంచి పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో భట్టి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని, తెలంగాణలోని పేద, బడుగు, బలహీన వర్గాలు ఆయనకు అండగా ఉన్నాయన్నారు.

ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని, ప్రతిసారి తమను ఆదరించిందని రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌లోకి స్వాగతం పలుకుతున్నానని రాహుల్‌ అన్నారు. పొంగులేటి బీఆర్‌ఎస్‌కు స్వస్తి చెప్పి కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. పేదలు, రైతులు, బలహీన వర్గాలకు తెలంగాణ సాధన ఒక స్వప్నమని, 9 ఏళ్ల నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కలను ధ్వంసం చేస్తూ వస్తోందని రాహుల్‌ ఆరోపించారు. తెలంగాణ ప్రజల కల ఒకటైతే.. టీఆర్‌ఎస్‌ చేసింది మరొకటని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిందని, బీఆర్‌ఎస్‌ అంటే.. బీజేపీ విస్తేదార్‌ సమితి అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు రూపాయల అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ తన జాగీరు అనుకుంటున్నారని రాహుల్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో రైతులు, ఆదివాసీలు, యువత, దళితులు అందరూ నష్టపోయారని అన్నారు. ధరణి పోర్టల్‌ సమస్యలను యాత్రలో తెలుసుకున్నానని రాహుల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌ అందిస్తామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకుంటామని,

గిరిజనులకు పోడు భూములు ఇస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ ఉందని, బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తోందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అడ్రస్‌ లేకుండా పోయిందన్నారు. తెలంగాణలోనూ కర్ణాటక తరహా ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్‌కు, బీజేపీ బీ టీమ్‌కు మాత్రమేనన్నారు. బీజేపీ బీ టీమ్‌ బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఓడిస్తుందన్నారు. ఇటీవల విపక్షాల సమావేశం జరిగిందని, ఆ భేటీకి బీఆర్‌ఎస్‌ వస్తుందా? అని అడిగామని, బీఆర్‌ఎస్‌ భేటీకీ వస్తే తాము హాజరుకాబోమని చెప్పామని రాహుల్‌ తెలిపారు. కేసీఆర్‌ అవినీతికి మోదీ ఆశీస్సులు ఉన్నాయని రాహుల్‌ దుయ్యబట్టారు. కేసీఆర్‌ సర్కార్‌ స్కాములన్నీ మోదీకి తెలుసునన్నారు. సీఎం కేసీఆర్‌ వైపు ధనికులు, కాంట్రాక్టర్లు ఉన్నారని, కాంగ్రెస్ వైపు పేదలు, రైతులు, అన్ని వర్గాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో మొదట్లో ముక్కోణ పోటీ అనుకున్నారని, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఖతమ్‌ అయ్యిందన్నారు.

Tags:    

Similar News