కాంగ్రెస్‌కి మద్ధతిస్తే.. ఉచిత విద్యుత్తు రద్దే : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఉచిత కరెంటును కట్ చేస్తారని.. ప్రజలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.

Update: 2023-07-16 01:29 GMT

కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఉచిత కరెంటును కట్ చేస్తారని.. ప్రజలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు రైతులను అవమానించినట్లు వున్నాయని మండిపడ్డారు. రాష్ర్టంలోని రైతులకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విధానం పైన ప్రతి గ్రామంలో చర్చ జరిపి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని గులాబీ పార్టీ శ్రేణులతో మంత్రి కేటీఆర్ అన్నారు. జూలై 17 వ తేదీ నుంచి పది రోజుల పాటు రైతు సమావేశాలు ఏర్పాటు చేసి ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలను ప్రతి గ్రామంలో రైతులకు వివరించి చర్చ జరపాలని మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నినాదం మూడు పంటలని, కాంగ్రెస్ పార్టీ నినాదం మూడు గంటల విద్యుత్ అని కేటీఆర్ తెలిపారు. రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత విద్యుత్తు వద్దు, మూడు గంటల విద్యుత్ చాలు అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేయాలని నాయకులను మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పాలని తీర్మానం చేయాలని అన్నారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? వెలుగు జిలుగుల బీఆర్ఎస్ కావాలా? అని ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు.

రైతు సమావేశ బాధ్యతలను నేరుగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ సూచించారు. గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతు సమ్మేళనాలు నిర్వహించాలని, ఒక్కో సభకు కనీసం 1000 మంది రైతులు హాజరు కావాలని కేటీఆర్‌ కోరారు. ఉచిత విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ నేతల ప్రకటనలను ఖండిస్తూ, తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయాలన్నారు. కాగా, శనివారం విలేకరుల సమావేశంలో మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News