KCR : అదే ఇప్పుడు శాపంగా మారింది.. నాడు ఆ పార్టీ ఎదిగేలా వ్యూహం.. నేడు..?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు

Update: 2024-03-20 13:32 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు. అంతేకాదు వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలోనూ కిందా మీదా పడుతూ వస్తుంది. బీఆర్ఎస్ నేతల బ్లాక్‌మెయిల్స్ మొదలయ్యాయి. మొన్నటి వరకూ గొంతెత్తని నేతలు కూడా నేడు తమ వైపు చూడకపోతే జంప్ చేస్తామంటూ సిగ్నల్స్ పంపుతున్నారు. ఉద్యమ పార్టీ అధినేతకు ఇది ఊపిరి సలపనివ్వడం లేదు. నిన్నటి వరకూ తాను ఆదేశించిందే ఆచరించిన నేతలు నేడు రొమ్ము విరుచుకుని ఎదురుతిరగడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో...
ఇదిలా ఉండగా.. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలన్న పట్టుదల ఆయనలో కనిపిస్తుంది. అప్పుడే నేతల గేట్లు దాటే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు అంతుచిక్కని స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నారు. బలమైన నేతలను తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పథ్నాలుగు స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత నిరాశలోనే ఇంకా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్యాడర్ కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
అధికారంలో ఉండగా...
మరొక వైపు కేసీఆర్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ను ఎదగనివ్వకుండా ఉండేందుకు బీజేపీకి తెలంగాణలో చోటు కల్పించారన్న వాదన ఉంది. బీజేపీ బలం పెంచుకోవడానికి కేసీఆర్ కారణమన్న అభిప్రాయమూ లేకపోలేదు. బీజేపీ ఎంత ఎదిగితే కాంగ్రెస్ బలహీనపడి ఓట్లు చీలి మూడోసారి తాను అధికారంలోకి వస్తానని ఆయన భావించి పరోక్షంగా బీజేపీ ఎదుగుదలకు ఆయన సహకరించాడంటారు. కాంగ్రెస్ ను వదిలేసి, బీజేపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని చిత్రీకరించడం, బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని కేసులు నమోదు చేయడం, బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వంటివి బీజేపీీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
బీజేపీ ఎదుగుదలకు...
అయితే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానంలోకి వెళ్లిపోయిందన్న వార్తలు గులాబీ పార్టీల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లోక్‌సభ ఎన్నిక్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉందన్న సీన్ ఇప్పటికే క్రియేట్ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కావడం కూడా బీజేపీకి కలసి రావడంతో పాటు బీఆర్ఎస్ కు కొంత రాజకీయంగా ఇబ్బందిగా మారిందంటున్నారు. కవిత అరెస్ట్‌తో సానుభూతి రాకపోగా, లిక్కర్ స్కాంలో అరెస్ట్ కావడంతో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ నాడు బీజేపీ ఎదగాలని కోరుకుంటే.. ఇప్పడు అదే పార్టీ తనకు తలనొప్పిగా మారింది. మొత్తం మీద కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఆయనకు, ఆయన పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయని చెప్పకతప్పదు.


Tags:    

Similar News