KCR : తొలిసారి జనంలోకి... ఏం మాట్లాడతారన్న దానిపై రాష్ట్రమంతా ఆసక్తి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రజల్లోకి వస్తున్నారు. దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత ఆయన జనం ముందుకు రానున్నారు

Update: 2024-02-13 03:52 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తొలిసారి ప్రజల్లోకి వస్తున్నారు. దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత ఆయన జనం ముందుకు రానున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనంలోకి రాలేకపోయారు. కాలికి గాయం కావడంతో విశ్రాంతిలోనే ఉన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తొలి బహిరంగ సభ నల్లగొండలో నిర్వహిస్తున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులపై పెత్తనాన్ని కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్దపడిందని ఆరోపిస్తూ ఆయన ఈ సభను పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు.

తనదే అధికారమని...
నిజానికి కేసీఆర్ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదు. తనదే మూడోసారి కూడా అధికారమని భావించారు. కానీ పదేళ్ల కాలంలో ఆయన వ్యవహార శైలితో పాటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఆయన ఊహించని ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ వ్యూహాలు దెబ్బతిన్నాయి. అంచనాలు అందని రిజల్ట్ రావడంతో ఆయన తట్టుకోలేక ఫలితాలు వస్తున్న వేళ కాన్వాయ్ లేకుండానే ఫాం హౌస్ కు వెళ్లారంటే ఎంత ఫ్రస్టేషన్ కు గురయ్యారో వేరే చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఆయన ఓటమి నుంచి తేరుకుని తొలిసారి బయటకు వస్తున్నారు. భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
పలు అంశాలపై...
ఇప్పటి వరకూ ఎన్నికల ఫలితాలపైనా, ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలపైన ఆయన ఎక్కడా స్పందించలేదు. ఈరోజు నల్లగొండ వేదికగా అన్నింటికీ సమాధానమిచ్చే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు విద్యుత్తు, నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు రైతు బంధు వంటి కార్యక్రమాలపై కూడా ఆయన ప్రసంగం కొనసాగే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపైనా, పార్టీపైనే చేసే ఆరోపణలకు ఆయన సూటిగా ఈ వేదిక పైనుంచే సమాధానం చెప్పనున్నారని తెలిసింది. అసెంబ్లీలో తమకు సమయం ఇవ్వకపోవడం, పదే పదే తమ పార్టీ నేతల ప్రసంగాన్ని అడ్డుతగలడం వంటి వాటిని కూడా ప్రస్తావించనున్నారు.
నేతలు, క్యాడర్ లో...
మరోవైపు బీఆర్ఎస్ నుంచి నేతలు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. కాంగ్రెస్ మరింత బలపడితే తమకు పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురువుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే ఆయన రెండు నెలల తర్వాత తొలిసారి జనంలోకి వస్తున్నారు. క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి మాత్రమే కాదు. లీడర్లు కూడా కారు దిగకుండా ఉండేందుకు ఈ సభను కేసీఆర్ ఉపయోగించుకోనున్నారు. అందుకే రాష్ట్రమంతా కేసీఆర్ ప్రసంగంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఆయన సహజంగా మాటకారి. వాగ్బాణాలు సంధించడంలో మేటి. అలాంటి కేసీఆర్ ఎలాంటి పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News