Raja Singh : ప్రధాని మోదీ సభకు దూరం.... ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సభకు రాలేదంటే?

బీజేపీ నేత రాజాసింగ్ ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

Update: 2023-11-08 01:58 GMT

రాజాసింగ్ అంటే కరడుగట్టిన కాషాయం నేత. ఆయన మాటలు.. చేష్టలు ఎప్పుడూ రెచ్చగొట్టే విధంగా ఉంటాయంటారు. హిందూ సమాజం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతూ గోషా మహల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే ఆయనకున్న స్పెషాలిటీ గురించి వేరే విధంగా చెప్పాల్సిన పనిలేదు. గోషామహల్ లో అన్ని పార్టీలను కాదని కాషాయం జెండా ఎగురవేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

మోదీ ని గురువుగా...
అలంటి బీజేపీ నేత రాజాసింగ్ ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ఆయన తనకు గురువు మోదీ అని పదే పదే చెబుతారు. ఎల్.బి. స్టేడియం అంటే ఆయన నియోజకవర్గమే. పైగా ప్రధాని పాల్గొంది బీసీ సదస్సులో. మరి ఆయన ఎందుకు ఈ సమావేశంలో కన్పించలేదన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజాసింగ్ ను బీజేపీ నేతలు పట్టించుకోలేదా? సదస్సుకు పిలుపు లేదా? లేక రాజాసింగ్ మరే కారణాల వల్లనైనా అలక బూనారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అందరికీ అదే అనుమానం...
కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాజాసింగ్ తన ఇంటి పక్కనే జరుగుతున్న ప్రధాని సభకు హాజరు కాకపోవడమేంటన్న ప్రశ్న ప్రతి బీజేపీ అభిమానికి కలుగుతుంది. పైగా ఆయనకు మరోసారి బీజేపీ గోషామహల్ టిక్కెట్ ను కేటాయించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను కూడా ఎత్తివేసింది. మరి రాజాసింగ్ కు ఏమయింది? ఎందుకు ప్రధాని మోదీ పాల్గొన్న సభకు హాజరు కాలేదు. మరోసారి ఆయన పార్టీ నాయకుల వ్యవహారశైలిపై మండి పడుతూ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన నియోజకవర్గంలో జరిగే సభకు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల సమయంలో హాజరు కాకపోవడం అంటే ఏదో ఉందని ఖచ్చితంగా అనుకోవాల్సిందే.
ఎన్నికల వ్యయం భయంతో....
కానీ రాజాసింగ్ మాత్రం తన వెర్షన్ ను వేరే విధంగా వినిపించారు. ఈ సభకు తాను హాజరైతే ఆ ఖర్చు మొత్తం తన ఎన్నికల వ్యయం కింద వస్తుందని, అందుకే తాను హాజరు కాలేదని, కేవలం టీవీలోనే చూడాల్సి వచ్చిందని ఒక వీడియో విడుదల చేశారు. తమ ముఖ్యమైన కార్యకర్తలతో కలసి తాను కూడా ప్రధాని ప్రసంగాన్ని టీవీలో చూడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తాను కేంద్ర ఎన్నికల కమిషన్ తో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని తాను విడుదల చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు. ఎన్నికల వ్యయానికి భయపడే రాజాసింగ్ ప్రధాని మోదీ సభకు దూరంగా ఉన్నారన్న ఆయన చెబుతున్న మాటలను ఎన్నికల వేళ ఖచ్చితంగా నమ్మాల్సిందే.


Tags:    

Similar News