TDP : తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలట...తమ్ముళ్లూ.. నిజమా? కాదా?

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు

Update: 2023-11-10 07:32 GMT

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలోనూ తమదే విజయం అన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ వేవ్ అలా సరిహద్దులు దాటి ఆంధ్రవైపు వస్తుందని విశ్వసిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబును యాభై రెండు రోజుల పాటు జైలులో ఉంచారు. దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకరించిందని భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని సైకిల్ పార్టీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా కాంగ్రెస్ కు అనుకూలిస్తుందని చెబుతున్నారు.

జగన్ కు సహకరిస్తారని...
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ జగన్ కు సహకరిస్తారన్నది వారి అభిప్రాయం. 2019 ఎన్నికల్లోనూ జగన్ కు పరోక్షంగా కేసీఆర్ సాయం చేశారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ కూడా పొత్తు పెట్టుకోవచ్చని, బీజేపీని దూరం పెట్టవచ్చని అత్యధిక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. పైగా తమ పార్టీ అధినేతను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అందువల్ల బీజేపీ పై ఉన్న వ్యతిరేకత నుంచి తమను తాము కాపాడుకోవాలంటే దానికి దూరంగా ఉండటమే బెటర్ అన్న భావన ఎక్కువ మందిలో ఉంది.
కాంగ్రెస్ ను కలుపుకుని...
అదే కాంగ్రెస్ అయితే కొద్దిలో కొద్ది బెటర్. రాష్ట్రాన్ని విభజించినా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓటును బలంగా తమవైపు తిప్పుకోవన్న అంచనాలో ఉన్నారు. జనసేనతో పాటు కలసి నడుస్తున్నా బీజేపీ కంటే కాంగ్రెస్ తో కలవడమే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ అక్కడ అధికారంలోకి రాకపోతే మానసికంగా కూడా జగన్ ను దెబ్బతీయవచ్చన్నది వారి ఆలోచన. అంతేకాదు.. ఆర్థికంగా కూడా జగన్ పార్టీకి కేసీఆర్ నుంచి నిధులు అందే అవకాశంలేదని, అందుకోసమే తెలంగాణలో కాంగ్రెస్ రావాలని టీడీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి నష్టపోయిన తాము ఈసారి అదే పార్టీని కలుపుకుని తాము లాభపడాలన్న ఉద్దేశ్యం ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
ఫోన్లు చేసి మరీ...
క్యాడర్ నుంచి కూడా బీజేపీని దూరం పెట్టాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి నేరుగానే బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనం దృష్టిలో నవ్వుల పాలు కాక తప్పదని సూచిస్తున్నారు. టీడీపీ, జనసేన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ ఇదేరకమైన అభిప్రాయం వ్యక్తమయిందని తెలిసింది. అందుకే తెలంగాణలో తమ క్యాడర్ కు కూడా పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతివ్వమని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. ఫోన్లు చేసి తమ బంధువులు, క్యాడర్ కు చెబుతున్న తీరు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారతున్నాయి. టీడీపీ పోటీ నుంచి వెనక్కు తగ్గడానికి కాంగ్రెస్ మేలు చేయడం కోసమేనన్నది తెలిసి ముఖ్యనేతలు ఇప్పటికే తెలంగాణలో ఉన్న తమ ఓటు బ్యాంకును ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి గాంధీ భవన్ వైపునకు మళ్లించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో?
Tags:    

Similar News