ఒక్క మామిడి.. 40వేల రూపాయలా

అయితే ఒక్క మామిడి పండు ధర 40000 రూపాయలు అంటే కొనడానికే కాదు.. తినడానికి కూడా భయపడుతూ ఉంటాం

Update: 2023-05-25 04:12 GMT

సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చేసినట్లే..! మామిడి పండ్లు అంటే ఇష్టం ఉన్న వాళ్లు ఈ సీజన్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. మార్కెట్ లో దొరికే వెరైటీలను బట్టి కొనుక్కుని తినేస్తూ ఉంటారు. అయితే ఒక్క మామిడి పండు ధర 40000 రూపాయలు అంటే కొనడానికే కాదు.. తినడానికి కూడా భయపడుతూ ఉంటాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు రకమైన 'మియాజాకి' ని తినాలంటే 40000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కర్ణాటకలోని కొప్పల్‌లోని మామిడి పండ్ల మేళాలో ఈ మామిడి పండు ప్రదర్శనకు వచ్చింది. ఒక్కో పండు రూ. 40,000 (కిలో రూ. 2.5 లక్షలు) ధర ఉందని చెప్పడంతో మేళాకు వచ్చిన వాళ్లు కాస్తా షాక్ అవుతున్నారు. కొప్పల్ జిల్లాలో మియాజాకి సాగును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. మేళాలో ప్రదర్శన కోసం హార్టికల్చర్ అధికారులు మధ్యప్రదేశ్ నుండి ఒక మియాజాకి మామిడిని మాత్రమే తీసుకువచ్చారు. ఈ రకాన్ని జపాన్‌లో ఎక్కువగా పండిస్తారు.

ఈ ప్రదర్శన మే 23న ప్రారంభమైనప్పటి నుండి వందలాది మంది రైతులు మియాజాకీని చూసేందుకు తరలివస్తున్నారు. మే 31 వరకు మేళా కొనసాగుతుంది. చాలా మంది రైతులు ఈ ఖరీదైన మామిడి పండుతో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. మేళా ప్రారంభమైన తర్వాత ఎరుపు రంగు మియాజాకి ఫోటోలు వైరల్ అయ్యాయి.కొప్పల్ కేసర్, బెన్షన్, దశేరి, స్వర్ణరేఖ, అల్ఫోన్సో, తోతాపురి, రసమరి, పునరి, మల్లిక వంటి ఇతర ప్రసిద్ధ రకాల మామిడి పండ్లు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ మేళాలో మొత్తం 51 మంది రైతులు మామిడి పండ్లను విక్రయించేందుకు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఒక్కో పండు ధర 40000 రూపాయలు తెలిసి అందరూ నోరెళ్లబెడుతూ ఉన్నారు. మియాజాకి కిలో కొనాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని మేళాలో ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. కొప్పల్‌ జిల్లాలో మియాజాకి సాగుకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News