Benguluru : వామ్మో బెంగలూరు వెళ్లాలంటే.. నీళ్లు కొనుక్కుని వెళ్లాల్సిందేనా?

బెంగళూరులో నీటి ఎద్దడి తలెత్తింది. ఫిబ్రవరి నెలలోనే కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది

Update: 2025-02-19 04:47 GMT

బెంగళూరులో అధిక వర్షం పడినా ఇబ్బందులే. అంటే వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. ఎప్పుడు నగరం మునుగుతుందో తెలియక బెంగళూరు వాసులు భయపడిపోతారు. అలాగే ఎండాకాలం రాకముందే నీటి సమస్య తీవ్రంగా మారుతుంది. కావేరిలో నీరు తగ్గడంతో ఫిబ్రవరి నెలలోనే బెంగళూరులో నీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం ప్రజలు అల్లాడి పోతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఫిబ్రవరి నెల నుంచే బెంగళూరులో తాగునీటి కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది.

గత వేసవిలో...
2024 వేసవిలో బెంగళూరు తీవ్ర నీటి ఎద్డడిని ఎదుర్కొంది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. గత సీజన్ లో టెకీలు బెంగళూరును ఖాళీ చేసి తమ సొంత స్థలాలకు వెళ్లిపోయారు. నీటి ఎద్దడి దెబ్బకు ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోం ప్రకటించాల్సి వచ్చింది. మరొకవైపు బెంగళూరు మహాపాలిక సంస్థ నీటిని వృధా చేసిన వారికి జరిమానా కూడా విధించింది. కార్లను కడగటంపై కూడా నిషేధం విధించింది. తడిగుడ్డతో తుడుచుకోవాలని చెప్పింది.
సేమ్ సీన్ రిపీట్...
ఇప్పుడు కూడా జరిమానా విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేసిన వారికి ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఓవర్ ఫ్లో అయినా అంగీకరించడం లేదు. ఇక ఇప్పటికే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు.ఒక్కొక్క ట్యాంకర్ పన్నెండు నుంచి పదిహేను వందలకు విక్రయిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఇంతటి నీటి ఎద్దడి ఉంటే ఇక మే నెలలో ఎంత తీవ్రత ఉంటుందోనని ఇప్పటి నుంచే కర్ణాటక సర్కార్ అప్రమత్తమయినట్లు కనిపిస్తుంది. మరోసారి బెంగళూరు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News