కంటి చూపు లేకుండానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అంగ్మో
హిమాచల్‌కు చెందిన అంధ మహిళ ఛోంజిన్ అంగ్మో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి దేశ గర్వంగా నిలిచారు. తొలి భారతీయ మహిళగా రికార్డు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి కంటి చూపు లేకపోవడం అడ్డంకి కాదని నిరూపించింది ఓ మహిళ. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఛోంజిన్ అంగ్మో త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంపై రెపరెపలాడించారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా, ప్రపంచంలోనే ఐదో వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఇండో–టిబెటన్ సరిహద్దులకు సమీపంలోని మారుమూల చంగో గ్రామంలో జన్మించిన అంగ్మో ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు చూపు పూర్తిగా కోల్పోయారు. ఢిల్లీ వర్సిటీ పరిధిలోని మిరాండా హౌస్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సర్వీసెస్ అసోసియేట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం తన చిన్ననాటి కల అని చెప్పుకునే అంగ్మో ఎవరెస్టు ఎక్కడానికి ముందు ఎన్నో పర్వతాలను అధిరోహించారు. ఎన్నో సాహసాలకు కూడా కేరాఫ్ గా నిలిచారు.