తొలిసారి ట్రాన్స్ జెండర్ గెలుపు.. కమ్యూనిటీ హర్షం

ఇటీవల తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో 37వ వార్డు నుంచి డీఎంకే తరపున ట్రాన్స్ జెండర్ అభ్యర్థి..

Update: 2022-02-23 12:57 GMT

వెల్లూర్ : ఎన్నికల్లో పోటీ చేసి, తొలిసారి ఒక ట్రాన్స్ జెండర్ గెలిచారు. ఇటీవల తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో 37వ వార్డు నుంచి డీఎంకే తరపున ట్రాన్స్ జెండర్ అభ్యర్థి గంగా నాయక్ పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు.. విజయకేతనం ఎగురవేశాడు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఒక ట్రాన్స్ జెండర్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గంగానాయక్ విజయంపై ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గంగా నాయక్ ప్రస్తుతం దక్షిణ భారత ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తూ.. సామాజిక కార్యకర్తగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

గంగానాయక్ తల్లిదండ్రులు దినసరి కూలీలు. గంగానాయక్ ఓ నాటక బృందాన్ని కూడా నడుపుతున్నారు. ఆ బృందంలో 50 మంది పనిచేస్తుండగా.. వారిలో 30 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కరోనా సమయంలో గంగానాయక్ తన నాటకబృందంతో కలిసి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. దాంతో ప్రజల్లో గంగానాయక్ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.



Tags:    

Similar News