Operation Sindoora : భారత్ లో నిత్యావసర వస్తువుల నిల్వలపై కేంద్ర ఏం చెప్పిందంటే?
పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది
పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయలు ధరలు కూడా పెరగవని తెలిపింది. దేశంలో నిత్యావసరాల కొరత లేదని, కూరగాయలు కూడా పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ప్రజలుఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ధరలు స్థిరంగా ఉండేందుకు...
భారత్ లోని అన్ని నగరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలను నమ్మ వద్దని, నిత్యావసర వస్తువులు,కూరగాయలకు ఢోకా లేదని పేర్కొంది. డిమాండ్ కు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, అయితే కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలకు చెందిన ఆహార కార్యదర్శలుతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ధరలను పెంచి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి.
నిఘా నిరంతరం...
వ్యాపారులతో పాటు సరఫరాదారులపై నిఘా ఉంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. యుద్ధం పేరు చెప్పి కొందరు ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అది నేరంగా పరిగణిస్తామని తెలిపింది. అవసరమైతే అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. నిరంతరం అప్రమత్తంగా ఉండి, ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు పెరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రకటనల రూపంలో కూడా ప్రజలకు, వ్యాపారులకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.సరిహద్దు జిల్లాల్లోని వ్యాపారుల తమ వద్ద నిల్వల సమాచారాన్ని మూడు రోజుల్లో తెలియజేయాలని కూడా సరిహద్దు రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా ధరలు పెరగబోవన్నహామీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.