టీసీఎస్ సీఈఓ రాజీనామా
టీసీఎస్ సీఈఓగా ఆయనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. టీసీఎస్ సంస్థకు..
tcs ceo rajesh gopinadhan
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆరేళ్లుగా సంస్థకు సీఈఓగా సేవలందిస్తున్న రాజేశ్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా చేసినట్టు టీసీఎస్ ప్రకటించింది. రాజేశ్ గోపీనాథన్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ టీసీఎస్‌లోనే కొనసాగుతారని, తదుపరి సీఈఓకు మార్గనిర్దేశనం చేస్తారని సంస్థ వెల్లడించింది. టీసీఎస్ సీఈఓగా ఆయనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. టీసీఎస్ సంస్థకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న కె.కృతివాసన్ టీసీఎస్ సీఈఓగా మార్చి 16న బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా.. టీసీఎస్ సంస్థ సీఈఓగా తనకు ఈ ఆరేళ్లు అద్భుతంగా గడిచిపోయాయని రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. టీసీఎస్ లో తన ప్రయాణం 22 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన ప్రయాణమని చెప్పుకొచ్చారు. తన నేతృత్వంలో సంస్థ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని, మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందిందని పేర్కొన్నారు. "తదుపరి ఏం చేయాలనే విషయమై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇక.. రాజీనామా విషయమై సుదీర్ఘంగా ఆలోచించి, చైర్మన్‌తో పాటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో చర్చించాకే తప్పుకోవాలని నిర్ణయించాను" అని రాజేశ్ తెలిపారు.