ఏపీ-తమిళనాడు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ మొదలుకాబోతోందా..?

తమిళనాడు సరిహద్దులో ఉన్న కుశస్థలి నది నుంచి నీటిని దారి మళ్లించి చెరువులకు సరఫరా చేసేందుకు

Update: 2022-08-14 02:08 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. కుశస్థలి నదిపై ఏపీ సర్కార్‌ నిర్మిస్తున్న ఆనకట్టలను ఖండిస్తున్నామన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆనకట్టలు నిర్మించొద్దని.. ఏపీ ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటున్న రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే చెన్నైకి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడుతుందని సీఎం స్టాలిన్‌ లేఖలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కతరపల్లి, ముక్కలకండిగై గ్రామాల్లో కుశస్థలి నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. నగరి దగ్గర కుశస్థలి నదికి వరదలొస్తే నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టేందుకు గొలుసుకట్టు విధానంలో 20 చెరువులకు మళ్లించేలా ప్రాజెక్టుల్ని చేపట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ రెండు ఆనకట్టల వల్ల భవిష్యత్తులో చెన్నై నగరానికి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని లేఖలో తెలిపారు సీఎం స్టాలిన్. దీని వల్ల చెన్నై నగరానికి తాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న పూండీ రిజర్వాయర్‌కు నీరు రాకుండా పోతుందని లేఖలో తెలిపారు.

తమిళనాడు సరిహద్దులో ఉన్న కుశస్థలి నది నుంచి నీటిని దారి మళ్లించి చెరువులకు సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం 2017లో కూడా ప్రయత్నించింది. ఆ సమయంలో వరదల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అప్పటి నుంచి పనులు చేపట్టలేదు. ఇటీవలి కాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుశస్థలి నది నుంచి నీరు మాత్రం చెరువులకు చేరకుండా వృథాగా సముద్రంలో కలిసిపోతోంది.


Tags:    

Similar News