ఏఐ, పన్ను ఎగవేతపై జాతీయ చర్చకు దారితీసిన సుధాకర్ రెడ్డి ఉదుముల దర్యాప్తు కథనం

సుధాకర్ రెడ్డి ఉడుముల నేతృత్వంలో వచ్చిన డేటా దర్యాప్తు కథనం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది

Update: 2026-02-19 13:04 GMT

సుధాకర్ రెడ్డి ఉడుముల నేతృత్వంలో వచ్చిన డేటా దర్యాప్తు కథనం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్‌గా ఉన్న సుధాకర్ రెడ్డి రూపొందించిన ఈ విశ్లేషణ దేశవ్యాప్తంగా ప్రచురితమైంది. ట్విట్టర్ (ఎక్స్)లో వేలాది పోస్టులు వచ్చాయి. కథనంలోని అంశాలపై ఆర్థిక నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు, విధాన పరిశీలకులు స్పందించారు. మోహనదాస్ పై, అజయ్ బగ్గాతో పాటు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను నిపుణులు బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రెస్టారెంట్ రంగంతో మొదలైన ఈ చర్చ త్వరగా విస్తరించింది. ఏఐ ఆధారిత అమలు విధానం, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ నిర్మాణం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కట్టుదిట్టమైన అనుసరణ నియమాల అవసరం వంటి అంశాలు ప్రాధాన్యం పొందాయి.



 డెబ్భయి వేల కోట్ల పన్నుతో...

రూ.70 వేల కోట్ల పన్ను ఎగవేత అనుమానం ఈ నివేదిక కేంద్రంగా నిలిచింది. ఆహార, పానీయ రంగంలో ఒకే సంవత్సరానికి చెందిన లావాదేవీలలో కేవలం 10 శాతం డేటాను విశ్లేషించగా ఈ సరళి బయటపడిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బిర్యానీ ఔట్‌లెట్ల పరిశీలనతో ప్రారంభమైన విచారణ దేశంలోని అనేక రాష్ట్రాల వరకు విస్తరించింది. తొలి ధృవీకరణలో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధానంగా బయటపడ్డాయి. దాదాపు లక్షకు చేరువలో ఉన్న రెస్టారెంట్లు వివిధ దశల్లో పరిశీలనలోకి వచ్చాయి. సాధారణ తనిఖీలకు బదులుగా బ్యాక్‌ఎండ్ డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణను ఈ దర్యాప్తు ఆధారంగా తీసుకుంది. పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్‌వేర్ నిర్మాణం, డిలిషన్ లాగ్‌లు, లావాదేవీ రికార్డులను బిగ్ డేటా, ఏఐ సాధనాలతో పరిశీలించారు. సాధారణ ఉపరితల తనిఖీలకు చిక్కని దాచిన టర్నోవర్ సరళిని పునర్నిర్మించారు. మార్పులేని లాగ్‌లు, తప్పనిసరి ఆడిట్ ట్రయల్, సాఫ్ట్‌వేర్ స్థాయి బాధ్యతపై విధాన పరమైన ప్రశ్నలు ఈ నివేదిక లేవనెత్తింది.
ఆధారాలతో కూడిన కథనాలను...
పటిష్టమైన ఆధారాలతో కథనాలు రాయడంలో సుధాకర్ రెడ్డి ఉదుములకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా సుధాకర్ రెడ్డి ఉడుముల పలు ఆర్థిక మోసాలు, వ్యవస్థ లోపాలపై కథనాలు వెలువరించారు. తెల్గీ స్టాంప్ పేపర్ స్కాం తరువాతి పరిణామాలు, కిడ్నీ రాకెట్లు, అక్రమ గనుల కేసులు, కస్టమ్స్, జీఎస్టీ మోసాలు, రియల్ ఎస్టేట్, నియంత్రణ ఉల్లంఘనలపై రిపోర్టులు చేశారు. ప్రాథమిక పత్రాలు, ఆర్థిక లావాదేవీ సరళులు, సంస్థల బాధ్యత అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. ఆయన కథనాల ఆధారంగా పలు సందర్భాల్లో అధికారిక విచారణలు ప్రారంభమయ్యాయి. తాజా దర్యాప్తులో కూడా అదే విధానం కనిపించింది. కొన్ని సంస్థలకే పరిమితం కాకుండా డిజిటల్ బిల్లింగ్ వ్యవస్థల నిర్మాణ లోపాలను ప్రస్తావించారు.
సాంకేతిక పాలనకు...
ఇది కేవలం పన్నులపై దాడి కథనం కాదని, సాంకేతిక పాలనకు సంబంధించిన సమస్యగా చూపించారు. దేశంలో డిజిటలీకరణ వేగం, అనుసరణ వ్యవస్థ మధ్య తేడా ఉందా అన్న ప్రశ్నను ముందుకు తెచ్చారు. కథనం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండగా, వృత్తిపర వేదికల్లో చర్చ కొనసాగుతోంది. పన్ను అధికారులు తనిఖీలు మరింత విస్తరించే అవకాశముంది. పరిశ్రమ సంఘాలు, సాఫ్ట్‌వేర్ సంస్థలపై మార్పుల డిమాండ్ పెరుగుతోంది. నియంత్రణ మార్పులు వస్తాయా, లేక అమలు నిబంధనలు కఠినతరం అవుతాయా అన్నది చూడాలి. ఇప్పటికైతే ఏఐ, డిజిటల్ ఆడిట్ ట్రైల్, వ్యవస్థాత్మక బాధ్యత అంశాలు దేశ పన్ను పాలన చర్చలో కేంద్రంగా నిలిచాయి.






Tags:    

Similar News