Maoists : మావోయిస్టుల ఇక కోలుకోలేరా? అన్ స్టాపబుల్ ఆపరేషన్ లో పైచేయి ప్రభుత్వానిదేనా?
మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం 2024 నుంచి ఊపందుకుంది. అగ్రనేతలు మరణించారు
అవును.. ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు ఇదే ప్రశ్నలు సంధిస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం 2024 నుంచి ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టులు లేని భారత్ గా ఏర్పాటు చేస్తామన్న ప్రకటన నిజం కాబోతుందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు మరణించారు. అగ్రనేతలు కూడా హతమయ్యారు. దీంతో మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. అంతే కాదు అడవుల్లో జల్లెడ పడుతున్న భద్రతా దళాలు ఆపరేషన్ రెడ్ హంట్ ను కొనసాగిస్తూనే ఉన్నాయి.
సమాచారం అందుకుని మరీ...
2024లో ప్రారంభమయిన ఆపరేషన్ రెడ్ హంట్ ఆగకుండా సాగుతూనే ఉంది. సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో మావోయిస్టులు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతుంటారు. వారు మైదాన ప్రాంతానికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. చికిత్స నిమిత్తం, వైద్యం కోసం, మందుల నిమిత్తం మావోయిస్టులు రాకపోకలు సాగిస్తుంటారు. పైగా సమాచార వ్యవస్థను కూడా పోలీసులు తమకు అనుకూలంగా మలచుకోగలిగారు. తమకు మావోయిస్టుల సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచడమే కాకుండా భారీగా నగదును కూడా ముట్టచెబుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసు ఇన్ ఫార్మర్లుగా మారిపోయారంటారు.
చేరికలు లేక...
అదే సమయంలో మావోయిస్టుల్లో చేరికల సంఖ్య కూడా ఇటీవల కాలంలో తగ్గిందనే చెప్పాలి. కొత్త జనరేషన్ మొత్తం అడవుల వైపు చూడటం లేదు. చదువుపై దృష్టి పెట్టి ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెట్టడమే మావోయిస్టులలో చేరే వారి సంఖ్య గత కొంత కాలం నుంచి తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం యువత మొత్తం తమ ఫ్యూచర్ పై పెట్టడం, మావోయిస్టు భావాజాలం బలహీన పడటంతో పాటు ప్రభుత్వ పట్టు పెరిగిపోవడం కూడా అడవుల్లోకి వెళ్లి జీవించేందుకు నేటి తరం ఇష్టపడటం లేదు. ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పాలి. అందుకే ఎక్కువ మంది గిరిజనులను మావోయిస్టులు రిక్రూట్ చేసుకుంటున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది.
అగ్రనేతలు అందరూ...
2024 నుంచి ఇప్పటి వరకూ అంటే ఏడాది నుంచి జరుగుతున్న ఆపరేషన్ రెడ్ హంట్ లో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అగ్రనేతలు కూడా మరణిస్తుండటంతో ఉన్నవారికి దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఇటీవల కాలంలో వంద మంది వరకూ మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుపెట్టగలిగాయి. అంతటితో ఆగకుండా ఛత్తీస్ గఢ్, ఒడిశా పోలీసులతో పాటు భద్రతా దళాలు సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు అగ్రనేతలు అక్కిరాజు హరిగోపాల్ అలియాస్ ఆర్కే, సుధాకర్, చలపతి వంటి వారు మరణించడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ అని భావించాలి. నెత్తురోడుతున్న దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతూనే ఉంది.