సినిమాకు ఏ మాత్రం తీసిపోని రియల్ రాబరీ.. వీడియో షేర్ చేసిన సీఎం

రాబరీ విషయానికొస్తే.. రెడ్ ఫోర్ట్ ఏరియాకు చెందిన డెలివరీ ఏజెంట్, అతని సహాయకుడు కలిసి ఓ బ్యాగును గురుగ్రామ్ లో అందజేసేందుకు

Update: 2023-06-26 07:50 GMT

delhi robbery viral video

పట్టపగలే నడిరోడ్డులో సినీ ఫక్కీలో రాబరీ జరిగింది. దేశరాజధానిలో జరిగిన ఈ ఘటనంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రెండు బైక్ లపై వచ్చిన నలుగురు దొంగలు.. ఓ కారును ఆపి, గన్స్ తో బెదిరించి వారి వద్దనున్న క్యాష్ బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ లో జరిగిన ఈ చోరీ ఘటన వీడియోను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ప్రస్తుతం ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ఉన్న మరొకరిని ఎల్ జీగా నియమించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం కేంద్రానికి చేతకాకపోతే.. ఆ బాధ్యతను ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ట్వీట్ లో పేర్కొన్నారు.

రాబరీ విషయానికొస్తే.. రెడ్ ఫోర్ట్ ఏరియాకు చెందిన డెలివరీ ఏజెంట్, అతని సహాయకుడు కలిసి ఓ బ్యాగును గురుగ్రామ్ లో అందజేసేందుకు బయల్దేరారు. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. సేఫ్ గా ఉంటుందని కారు వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. కారు ప్రగతి మైదాన్ టన్నెల్ గుండా వెళుతుండగా రెండు బైక్ ల మీద వచ్చిన నలుగురు యువకులు కారును అడ్డగించారు. తుపాకులతో బెదిరించి నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. క్షణాల్లో జరిగిన ఈ వ్యవహారమంతా టన్నెల్ లో అమర్చిన సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డైంది.
ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు డెలివరీ సంస్థలో పనిచేసే ఉద్యోగుల గురించి ఆరా తీస్తున్నారు. సంస్థలోని వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా ? లేక వారి సహకారంతో బయటి వ్యక్తులు ఈ పని చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు తగిన ఆధారాలు ఇప్పటివరకూ దొరకలేదన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News