Naveen Patnaik: పెద్దాయన మొహంలో నవ్వు చెదరదు... అపజయం దరి చేరదు.. అది ఫిక్స్

నవీన్ పట్నాయక్ ఆరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన 24 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు

Update: 2024-01-05 06:55 GMT

Naveen Patnaik :ఎవరైనా ఒకసారి ముఖ్యమంత్రి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఆశ్చర్యపోతారు. ఒకసారి గెలిచి రెండోసారి సీఎం కావాలంటే అష్టకష్టాలు పడతారు. రెండుసార్లు గెలిస్తే మూడోసారి గెలవడం కష్టమే అవుతుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఇరవై నాలుగేళ్ల నుంచి ఆయనే ముఖ్యమంత్రి. ఆయనను పక్కకు దించాలన్న జాతీయ పార్టీలు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పైగా ఎన్నిక ఎన్నికకూ రాటుదేలిపోయారు. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ ముఖ్యమంత్రి పీఠం నాదే సొంతం అంటున్న ఆయన మరెవరో కాదు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. 2000లో ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ నేటికీ అదే పదవిలో ఉన్నారు. కించిత్ కూడా వెనక్కు తగ్గలేదు. ఒక్క ఓటమినీ రుచి చూడలేదు. మరోసారి త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆయనను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీలు పడిన శ్రమ వృధాయే తప్ప ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోయింది.

త్వరలో ఎన్నికలు...
ఒడిశా రాష్ట్ర ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఒడిశాలో బిజూపట్నాయక్ మరణం తర్వాత ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి వచ్చారు. ఉన్నత విద్యావంతుడైన ఆయన బిజూ జనతాదళ్ పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా బిజూ జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. ఇక అంతే.. దానికి ఎదురు లేకుండా పోయింది. నవీన్ పట్నాయక్ బ్రహ్మచారి. ఎనిమిది పదుల వయసులోనూ ఆయన చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఆయన పాలన అలా ఉందన్న మాట. ప్రతి ఎన్నికలోనూ ఆయనకే ఒడిశావాసులు జై కొడుతున్నారంటే ఆయనను అక్కడి ప్రజలు ఎంతగా ప్రేమిస్తున్నారో... ఆయనంటే ఎంత నమ్మకమో చెప్పకనే తెలుస్తుంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ కోటను బద్దలు కొట్టాలని ప్రయత్నించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు బీజేపీ వంతయింది.
ఇరవైనాలుగేళ్లుగా...
ఒడిశా శాసనసభలో 147 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 80 సీట్లు మాత్రమే. అయితే ఏ పార్టీ ఆయన దరి చేరనివ్వలేదు. అవినీతికి తావులేదు. పేదల సంక్షేమమే ఆయన లక్ష్యం. అందుకోసమే ఆయన నిరంతరం తపన పడతారు. సంక్షేమ పథకాలు మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా లేకపోయినా వారిని ప్రతి విష‍యంలో ఆదుకునేందుకు ఆయన నిత్యం ప్రయత్నం చేస్తుంటారు. విద్య, వైద్యం పేదవారికి అందించడంలో ఆయన రాజీపడరు. ఎమ్మెల్యేలయినా.. ఐఏఎస్‌లయినా సరే అవినీతికి పాల్పడ్డారని తెలిస్తే మాత్రం ఏరిపారేస్తారు అంతే. ప్రత్యర్థులను తన దరిదాపుల్లోనూ ఉండనివ్వకుండా చేయడానికి ఆయన ఈ ఏమంత్రం వేస్తారో కానీ ఎప్పుడూ అపజయం ఎరుగని నేత. వరస విజయాలతో ఆయన దూసుకెళుతున్నారు. ఆయనను ఓడించేందుకు చేసిన ఎవరి ప్రయత్నాలు ఫలించకపోవడానికి అనేక కారణాలున్నాయి.
ఈసారి గెలిస్తే...
దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలకు ఆయన ఒక రోల్ మోడల్ గా చెప్పాలి. 2014 ఎన్నికల్లో 117 స్థానాలు సాధించిన బిజూ జనతాదళ్ 2019 ఎన్నికల్లో మాత్రం 112 స్థానాలను దక్కించుకుంది. అంటే ఎప్పుడూ వందకు తగ్గకుండా ఆయన స్థానాలను పదిలం చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలకు చేరువగా ఉండేనేతగా ఆయనకు పేరుంది. నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపించగలుగుతున్నారు. అందుకే ఒడిశా ప్రజలు మరొకరిని నమ్మరు. వేరొకరు వస్తే తమను పట్టించుకోరని ప్రజల భయం కావచ్చు. అందుకే పెద్దాయనే మా పెద్ద అంటూ ప్రతి ఎన్నికల్లో జై కొడుతున్నారు. మరోసారి నవీన్ పట్నాయక్ గెలిస్తే మాత్రం దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల పాటు ఏకబిగిన చేసిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.
Tags:    

Similar News