భారత్ ప్రపంచ కృత్రిమ మేధస్సు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోనే సాంకేతికత రూపకల్పన చేసి, ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రపంచ నాయకులు, టెక్ కంపెనీల అధినేతలు, విధాన నిర్ణేతల సమక్షంలో ఆయన మాట్లాడారు. “డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా. డెలివర్ టు ది వరల్డ్. డెలివర్ టు హ్యూమానిటీ” అని మోదీ అన్నారు.డిజిటల్ రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ పెద్ద స్థాయిలో డిజిటల్ పబ్లిక్ మౌలిక వసతులు నిర్మించుకున్న అనుభవాన్ని ఏఐ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చూస్తోందని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
బిలియనర్లకు వదలకుండా...
ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్, , గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటరెస్ పాల్గొన్నారు. పేద దేశాల్లో ప్రాథమిక ఏఐ సామర్థ్యాల అభివృద్ధి కోసం 3 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు చేయాలని గుటెరెస్ పిలుపునిచ్చారు. నైపుణ్యాలు, డేటా ప్రాప్తి, చౌకైన కంప్యూటింగ్ శక్తి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. “ఏఐ భవిష్యత్తును కొద్దిమంది దేశాలు నిర్ణయించకూడదు. కొద్ది మంది బిలియనీర్ల చేతుల్లో వదిలేయకూడదు. ఇది అందరికీ చెందాలి” అని గుటెరెస్ అన్నారు.
ఏఐ విస్తరణలో భారత్ లక్ష్యమిదే...
అభివృద్ధి చెందిన దేశాలు, గ్లోబల్ సౌత్ మధ్య వారధిగా నిలవాలని భారత్ ప్రయత్నిస్తోంది. దేశంలో అమలు చేసిన డిజిటల్ ఐడీ, ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థలను తక్కువ ఖర్చుతో ఏఐ వినియోగానికి మాదిరిగా చూపిస్తున్నారు.“ఏఐను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ఇది శక్తివంతమైన సాధనంగా మారాలి” అని మోదీ తెలిపారు. దాదాపు 100 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ గ్లోబల్ టెక్ కంపెనీలకు కీలక మార్కెట్‌గా మారింది. గత డిసెంబరులో మైక్రోసాఫ్ట్ నాలుగేళ్లలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. క్లౌడ్, ఏఐ మౌలిక వసతుల విస్తరణే లక్ష్యమని తెలిపింది. అంతకు ముందు గూగుల్ ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను వెల్లడించింది. దేశంలో తొలి ఏఐ హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అమెజాన్ కూడా 2030 నాటికి 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని తెలిపింది.రాబోయే సంవత్సరాల్లో డేటా సెంటర్ల నిర్మాణానికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ వివరించారు. అయితే అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ లేదా చైనా సంస్థ డీప్ సీక్ లాంటి భారీ ఏఐ నమూనాలను స్వదేశంగా అభివృద్ధి చేయడంలో భారత్ వెనుకబడి ఉంది. అధునాతన సెమీకండక్టర్ చిప్‌లు, డేటా సెంటర్లు, వందలాది స్థానిక భాషల డేటా కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.
సదస్సులో ఇబ్బందులు...
సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. పాల్గొన్న వారు, ప్రదర్శకులు పెద్ద క్యూలు, ఆలస్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తిగత వస్తువులు, ప్రదర్శన సామగ్రి దొంగిలించారని సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. నిర్వాహకులు తర్వాత వాటిని తిరిగి పొందామని తెలిపారు.బుధవారం ఒక ప్రైవేటు భారతీయ విశ్వవిద్యాలయాన్ని సదస్సు నుంచి తొలగించారు. ఆ సంస్థ సిబ్బంది చైనాలో తయారైన రోబోటిక్ డాగ్ ను తమ ఆవిష్కరణగా చూపినట్లు తెలిసింది.గురువారం మరో పరిణామం చోటుచేసుకుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం నుంచి తప్పుకున్నారు. కారణం వెల్లడించలేదు. అయితే గేట్స్ ఫౌండేషన్ ప్రకారం సదస్సు ముఖ్య అంశాలపై దృష్టి నిలవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.