ఏడుగురు జవాన్లు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మణిపూర్ లోని 'నోనీ' జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరంపై భారీ కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు భారత సైనికులు మరణించారు

Update: 2022-06-30 10:52 GMT

మణిపూర్ లోని 'నోనీ' జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరంపై భారీ కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు భారత సైనికులు మరణించారు. మరింత మంది అదృశ్యమయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద కొండచరియలు విరిగిపడిందని, ఇది తమెంగ్‌లాంగ్, నోనీ జిల్లాల గుండా ప్రవహించే ఇజేయి నది ప్రవాహానికి కూడా ఆటంకం కలిగించిందని అధికారులు తెలిపారు. ఆనకట్ట లాంటి పరిస్థితిని సృష్టించిందని నోనీ డిప్యూటీ కమిషనర్ హౌలియన్‌లాల్ గైట్ తెలిపారు. సహయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో, డిప్యూటీ కమిషనర్ సాధారణ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు నది దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించారు.

నోనీ పోలీస్ స్టేషన్‌కు ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో మఖుమ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న టుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ శిబిరం సమీపంలో బుధవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడడంతో ఈ సంఘటన జరిగింది. "ఇప్పటివరకు మేము ఏడు మృతదేహాలను వెలికితీశాము. 13 మంది గాయపడిన వ్యక్తులను రక్షించాము. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నాము" అని సెర్చ్ & రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారి తెలిపారు. దాదాపు 23 మంది గల్లంతైనందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
రెస్క్యూ ఆపరేషన్ కోసం మణిపూర్ సీఎం నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి 19 మంది జవాన్లను నోనీ ఆర్మీ మెడికల్ యూనిట్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీరెన్ సింగ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో రెస్క్యూ కార్యకలాపాలను భౌతికంగా పర్యవేక్షించడానికి నోనీ జిల్లాకు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సీఎంతో మాట్లాడి కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News