కథక్ నాట్యాచార్య పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత

ప్రముఖ కథక్ నాట్యాచార్య పండిట్ బిర్జు మహారాజ్ (83) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో

Update: 2022-01-17 06:09 GMT

ప్రముఖ కథక్ నాట్యాచార్య పండిట్ బిర్జు మహారాజ్ (83) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కూడా చేయించుకున్నారు. డయాలసిస్ అనంతరం ఢిల్లీలోని సాకేత్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. తన తాతయ్య బిర్జు.. బహుశా గుండెపోటుతో మరణించి ఉండవచ్చని ఆయన మనుమరాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, లక్నోలోని ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ అసలు పేరు దుఃఖ్ హరణ్.

కొంతకాలానికి ఆయన తనపేరును పండిట్ బ్రిజ్మోహన్ గా మార్చుకున్నారు. బ్రిజ్మోహన్ నాథ్ మిశ్రాకు పొట్టి రూపమే బిర్జూ. కథక్ డ్యాన్సర్‌గానే కాక గాయకుడిగా బిర్జు కీర్తి గడించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ కూడా అందుకున్న పండిట్ బిర్జుకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఖైరాగఢ్ యూనివర్సిటీలు ఆయనకు డాక్టరేట్ ను అందించాయి. 1986లో భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీరావ్ మస్తానీ వంటి బాలీవుడ్ సినిమాలకు బిర్జు నృత్య దర్శకత్వం వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ, సింగర్ మాలిని అవస్థి తదితరులు బిర్జు మహారాజ్ మృతికి సంతాపం తెలిపారు. భారతీయ నృత్య కళకు ప్రపంచవ్యాప్తంగా అద్వితీయమైన గుర్తింపును అందించిన పండిట్ బిర్జూ మహారాజ్ జీ మరణం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటని మోదీ ట్వీట్ చేశారు.




Tags:    

Similar News