ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు: కేంద్ర ప్రభుత్వం
మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నా భారతీయ వినియోగదారులకు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వైవిధ్యభరితం చేశామన్నారు. ప్రస్తుతం భారత్ కు వచ్చే సరఫరాల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదని మంత్రి తెలిపారు. దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వద్ద అనేక వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయని తెలిపారు.
అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా, ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని మూసివేయాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయం దేశ అత్యున్నత జాతీయ భద్రతా మండలి, ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీలదేనని తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలిపే ఒక ఇరుకైన జలమార్గం. ఇరుకైన ప్రదేశంలో వెడల్పు సుమారు 21 మైళ్లు కాగా, ఇరువైపులా రెండు మైళ్ల వెడల్పుతో రెండు నౌకా రవాణా మార్గాలున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండానే సాగుతుంది. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తే, తక్షణమే ముడి చమురు ధరలు 30 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉందని, అదేవిధంగా గ్యాసోలిన్ ధరలు గ్యాలన్‌కు 5 డాలర్ల వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.