67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు నీట మునిగాయి.

Update: 2025-07-08 09:30 GMT

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. అయితే ఓ శునకం ఏకంగా 67 మంది ప్రాణాలను కాపాడింది. ఉపద్రవాలను కుక్కలు ముందే పసిగడతాయని అంటారు. అలా ఓ పెంపుడు కుక్క అరవడంతో పెను ప్రమాదం నుంచి 20 కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి. కళ్ల ముందే తమ ఇళ్లు మట్టిలో కలిసిపోయినా, ప్రాణాలతో బయటపడ్డామని గ్రామస్థులు ఊరట చెందుతున్నారు. మండి జిల్లా ధర్మపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో జూన్ 30న ఈ ఘటన చోటుచేసుకుంది.

భారీ వర్షం కురుస్తుండగా, నరేంద్ర అనే గ్రామస్థుడి ఇంట్లో నిద్రిస్తున్న కుక్క అర్ధరాత్రి సమయంలో గట్టిగా అరవడం, ఊళలు వేయడం ప్రారంభించింది. మెలకువ వచ్చి చూడగా ఇంటి గోడకు పగుళ్లు కనిపించాయి, నీరు లోపలికి రావడం మొదలైంది. వెంటనే కుక్కతో పాటు కిందకు పరిగెత్తి, కుటుంబ సభ్యులను, ఆ తర్వాత గ్రామస్తులందరినీ నిద్రలేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. గ్రామాన్ని వీడిన కొద్దిసేపటికే కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయింది.

Tags:    

Similar News